ఎస్ ఎస్ రాజమౌళి ఈ పేరు తెలియని వారుండరు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నివినియోగించుకోడంలో దిట్టయిన దర్శక మాంత్రికుడు రాజమౌళి.. ప్రస్తుతం బాహుబలి-2 ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. మగధీర సినిమాతోనే రాజమౌళి ఒక వండర్ క్రియేట్ చేసాడు. ఆతర్వాత న్యాచురల్ స్టార్ నానితో తీసిన ఈగ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. టీవీ ఛానల్ అత్యధిక మంది చూసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈగ సినిమానే అని చెప్పుకోవాలి. రాజమౌళితో సినిమా చేస్తే దానికీ హిట్ గ్యారెంటీ. అందుకే టాలీవుడ్‌లో ఏ హీరో అయిన సరే రాజమౌళితో ఒక్క సినిమానైనా చేస్తే చాలని అనుకుంటారు. ఇక అప్పట్లో నానితో ఈగ-2కు కూడా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి.
ప్రస్తుతం టాలీవుడ్‌లో సినీ వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక దర్శధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. ఎస్ ఎస్ కార్తికేయ బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసాడు. ఆతర్వాత కార్తీకేయ తండ్రిని మించిన దర్శకుడు అవుతాడని అందరు అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం తన కొడుకును హీరోగా చూడాలనుకుంటున్నాడట. అందుకోసం కార్తీకేయకు ప్రస్తుతం నటనలో శిక్షణకూడా ఇప్పిస్తున్నాడట. త్వరలోనే కార్తికేయ సినిమా లాంఛింగ్ ఉంటుందని ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఎంతోమందికి మరపురాని విజయాలను అందించిన దర్శకుడు రాజమౌళి తన కొడుకుతో ఎలాంటి సూపర్‌హిట్‌లు తీస్తాడో అని సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే రాజమౌళి కుటుంబ సభ్యులు సినిమా పరిశ్రమలోని అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతులు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రచయిత, అన్న కీరవాణి సంగీత దర్శకుడు, పెదనాన్న శివశక్తిదత్తా గీత రచయిత, వదిన లైన్ ప్రొడ్యూసర్, భార్య కాస్ట్యూమ్ డిజైనర్.. ఇలా ఆయన కుటంబ సభ్యులు సీనీ రంగానికి సంబంధించి చాలా రంగాల్లో ఉన్నారు. తెరవెనుకే అందరూ పనిచేస్తున్నారు గానీ, తెరముందు అంటే నటులు ఎవరూ లేరు. ఆ లోటును తీర్చడానికే వస్తున్నాడు కార్తీకేయ.
టాలీవుడ్‌లో హీరోల కొడుకులు ఎందరో హీరోలు అయ్యారు. కానీ డైరెక్టర్ల కొడుకులు హీరోలవ్వడం ఎప్పుడోగాని జరగదు. అలా హీరోలు అయ్యి నిలదొక్కుకున్నవారు కూడా చాలా తక్కువే. కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకుల తనయులు హీరోలుగా పరిచయం అయ్యి సక్సెస్ కాలేకపోయారు. అయితే కొందరు డైరెక్టర్ల తనయులు అయిన గోపీచంద్.. అల్లరి నరేష్ పర్వాలేదనిపించుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి కుమారుడు కూడా హీరోగా సక్సెస్ అవుతాడో కాదో అని వేచిచూడాలి.