‘ఒకే దేశం-ఒకే కార్డు’కు తెలంగాణ ఆదర్శం..

437
rection
- Advertisement -

రేషన్‌ లబ్ధిదారులకు ముఖ్యంగా వలసలు వెళ్లే నిరుపేదలు రేషన్‌ పొందలేక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలో చేపట్టిన రేషన్‌ పోర్టబిలిటీ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలో ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా ‘ఒకే దేశం-ఒకే కార్డు’ పేరుతో వచ్చే ఏడాది జూన్‌ లోగా దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఒక క్లస్టర్‌, గుజరాత్‌, మహారాష్ట్ర ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి నేషనల్‌ పోర్టబిలిటీ విధానాన్ని అమలులోకి తేనుంది.

 

ఇందుకు సంబంధించి హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఒక రేషన్‌ షాప్‌లో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. షాప్‌ నెం. 1677750లో పౌరసరఫరాల శాఖ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈశ్వర్‌ రావు, కార్డు నెం WAP0481025B0472, అలాగే విశాఖపట్నం జిల్లా, యలమంచిలికి చెందిన అప్పారావు, కార్డు నంబర్‌ WAP0034109700550 లబ్ధిదారులు సరుకులు తీసుకున్నాడు. పోర్టబిలిటీ ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడం పట్ల పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్ సబర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

one country-one card

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపంపిణీ ద్వారా ప్రయోజనం పొందుతున్న 2.82 కోట్ల లబ్ధిదారులకు సులభంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా… ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని గత ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్‌ సరుకులు పొందే వీలు కల్పించడంతో ఈ అవకాశాన్ని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ విధానాన్ని ఇప్పటి వరకు 2.07 కోట్ల మంది వినియోగించుకున్నారు.

 

ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 42 లక్షలు, మేడ్చల్‌ 29 లక్షలు, రంగారెడ్డి 18 లక్షలు, నిజామాబాద్‌ 10 లక్షలు, వరంగల్‌ 9 లక్షలు మంది కార్డుదారులు పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ సరుకులను తీసుకున్నారు. జీవనోపాధికై పట్టణ ప్రాంతాలకు వచ్చిన వారికి పోర్టబిలిటీ విధానం ఎంతో మేలు చేస్తోంది. ఇందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌లో అత్యధిక పోర్టబిలిటీ లావాదేవీలు జరగడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌లో అత్యధికంగా 42 లక్షల మందికి పైగా పోర్టబిలిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు.

one country-one card

దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ పోర్టబిలిటీ విధానాన్ని వచ్చే ఏడాది జూన్‌ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా నాలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 1వ తేదీ నుండి పోర్టబిలిటీ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. దీని ప్రకారం కేంద్ర ఆహార భద్రత పరిధిలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. లబ్ధిదారుడి ఆధార్‌ నంబర్‌ అతని రేషన్‌ కార్డుతో సీడింగ్‌ అయి ఉండాలి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా, గుజరాత్‌, మహారాష్ట్రలను రెండవ క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. మొదటి క్లస్టర్‌లోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని లబ్ధిదారులు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా రేషన్‌ సరుకులు తీసుకోవచ్చు. రెండో క్లస్టర్‌లోని గుజరాత్‌, మహారాష్ట్రలోని లబ్ధిదారులు ఈ రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకోవచ్చు.. ఈ క్లస్టర్లలో ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు మాత్రమే ఈ పోర్టబిలిటీ విధానం ద్వారా సరుకులు తీసుకోనే అవకాశం కల్పించింది. దీని ప్రకారం తెలంగాణలో 56 లక్షల మంది లబ్ధిదారులు ఈ సౌకర్యాన్ని పొందనున్నారు.

బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో, నిర్ణయించిన ధరల ప్రకారం లబ్ధిదారులకు సరఫరా చేయబడుతుంది. ప్రతి ఒక్కరికి బియ్యం కిలో రూ. 3 చొప్పున ఐదు కిలోలు, గోధుమలు కిలో రూ. 2కు పంపిణీ చేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ సమగ్ర నిర్వహణ పథకాన్ని పర్యవేక్షించడానికి ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా రాష్ట్ర అపెక్స్‌ కమిటీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ చైర్మన్‌గా రాష్ట్ర ప్రాజెక్ట్‌ ఈ-మిషన్‌ బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

- Advertisement -