కిడ్నాప్ కథ సుఖాంతం…క్షేమంగా ఇంటికి జషిత్

651
jasith
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్‌కు గురైన బాలుడు జషిత్ క్షేమంగా ఇంటికి చేరారు. కుతుకులూరు రోడ్డులో కిడ్నాపర్లు జషిత్‌ను వదిలివెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జషిత్‌ను చూడగానే అతడి తల్లి ఆనంద భాష్పాలతో అతడిని హత్తుకుంది. తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన జషిత్ తల్లి అతడు కిడ్నాప్ అయినప్పటి నుంచి కన్నీరుమున్నీరవుతూనే ఉన్నారు. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుమారుడు క్షేమంగా రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

జషిత్‌ తల్లిదండ్రులిద్దరూ బ్యాంకు ఉద్యోగులే. జషిత్‌ తండ్రి నూక వెంకటరమణ మండపేట యూనియన్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగవళి కెనరా బ్యాంకు ఉద్యోగి. వీరికి 2014లో పెళ్లియింది. ఏడాది తరువాత ఈ దంపతులకు జషిత్‌ జన్మించాడు.

సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో నాయనమ్మతో కలిసి ఇంటికి తిరిగొస్తున్నాడు. వారిద్దరూ మెట్లు ఎక్కుతుండగా బైక్‌పై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కరెంట్ ఉందా? అని ఆమెను అడిగాడు. లేదని ఆమె చెప్పగానే ముఖంపై కొట్టి బాలుడిని బైక్‌పై ఎత్తుకుపోయాడు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసులు, ఎస్పీ నయీం  ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. చివరకు పోలీసుల ప్రయత్నం ఫలించి కిడ్నాపర్లు బాలుడిని వదిలిపెట్టారు.

అసలు కిడ్నాప్‌ ఎలా జరిగిందో వివరించే ప్రయత్నం చేశాడు బాలుడు జషిత్. ‘నిన్న నేను తాతయ్య దగ్గర ఉన్నాను. ఏదో ఊరిలో ఉన్నాను. కొంతమంది నన్ను బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్‌ చేశారు. అందులో ఒకరి పేరు రాజు. ఈ మూడు రోజులూ నాకు ఇడ్లీ పెట్టారు. ఒక ఇంట్లో నన్ను వదిలేశారు. నన్ను మళ్లీ రాజే బైక్‌పై తీసుకొచ్చి వదిలేశాడు అని వివరించాడు.

- Advertisement -