భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు కెరీర్ లో తొలిసారిగా సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకుంది. రియో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తర్వాత పివి సింధు అతిపెద్ద విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. చైనా సూపర్ సిరీస్ ఫైనల్లో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో పదకొండో ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11 తేడాతో తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది.
అరవై తొమ్మిది నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింధు విజయం సాధించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మూడో గేమ్ లో దాదాపు ఆరు పాయింట్ల వరకూ సింధు-సున్ యులు సమంగా నిలిచి మ్యాచ్ పై ఆసక్తిని రేపారు. ఆ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తరువాత అదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్ను సొంతం చేసుకుంది. అదే క్రమంలో సున్ యు పదే పదే తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. తాజా విజయంతో తన ముఖాముఖి రికార్డును సింధు 3-3 తో సమం చేసింది. కాగా, గత ఏడాది డెన్మార్క్ ఓపెన్ సిరీస్ ఫైనల్ కు చేరిన సింధు, చైనా క్రీడాకారిణి లీ జ్యుర్ చేతిలో ఓటమి పాలైంది.