ఎఫ్‌సిఐ, సీడబ్ల్యుసీ, ఎస్‌డబ్ల్యుసీ అధికారులతో సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను కేటాయించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ విజ్ఞప్తి చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా,ముఖ్యంగా బాయిల్డ్ రైస్‌కు సంబంధించి గోదాముల్లో స్టోరేజ్ స్పేస్ కేటాయించకపోవడం వల్ల పౌరసరఫరాల శాఖ సమస్యలను ఎదుర్కోవలసి వస్తోందని, ముఖ్యంగా ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వంపై భారం పడుతోందని అన్నారు.
గోదాముల్లో స్టోరేజ్ స్పేస్‌పై మంగళవారం నాడు పౌరసరఫరాల భవన్లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), సీడబ్ల్యుసీ, ఎస్‌డబ్ల్యుసీ అధికారులతో కమిషనర్ సమావేశం అయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసిందన్నారు. రబీలో కొనుగోలు చేసిన 37 లక్షల మెట్రిక్ టన్నులు, ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన 40 లక్షల మెట్రిక్ టన్నుల్లో రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన బియ్యాన్ని కూడా ఎఫ్‌సీఐకి పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద అప్పగిస్తుంది.
ఈ బియ్యాన్ని అప్పగించడానికి రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నా ఎఫ్‌సీఐ కావల్సిన గోదాముల్లో స్థలం చూపించక పోవడం వల్ల జాప్యం జరుగుతోంది. ఈ జాప్యం వల్ల తెలంగాణ ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతోందన్నారు. వచ్చే ఏడాది కూడా ధాన్యం దిగుబడులు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని గోదాములను కేటాయించాలని కోరారు. దీనిపై త్వరలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ (రూరల్), మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో గోదాముల సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని వెంటనే పరిష్కరించాలని కోరారు.