17వ లోక్ సభ కొలువు దీరింది. నేటి నుంచి జూలై 26 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనుండగా ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన ఎంపీ వీరేంద్ర కుమార్ కొత్త ఎంపీలతో ప్రమాణం చేయించారు. జూన్ 19న కొత్త స్పీకర్ ఎన్నిక జరగనుండగా ఈ సారి కూడా మహిళా స్పీకర్‌ను ఎన్నుకుంటారని సమాచారం. రేసులో సీనియర్ ఎంపీ మేనకా గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్‌గా మేనకాగాంధీ ఎన్నికైతే వరుసగా మూడోసారి మహిళలకు స్పీకర్ పదవి దక్కినట్లవుతుంది. గతంలో మీరాకుమారి,తర్వాత సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇక జూన్ 20న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది.జూలై 5న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, దేశ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు.
కరువు, వ్యవసాయరంగ సంక్షోభం, నిరుద్యోగం-ఉపాధి కల్పనలపై బడ్జెట్లో ఫోకస్ చేయనున్నారు. రియల్ ఎస్టేట్, మౌలిక, నిర్మాణ రంగాలకు పెద్ద పీట వేయనున్నారు. చిన్న తరహా పరిశ్రమలు, మేక్ ఇన్ ఇండియాకు కేటాయింపులు పెంచే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాఖ్ బిల్లులో కొన్ని మార్పులు చేసి పార్లమెంట్‌కు తీసుకురానున్నారు. ఈసారి కూడా ప్రతిపక్ష నాయకుడు లేకుండానే లోక్‌సభ సాగనుంది. కాంగ్రెస్‌కు 52 సీట్లు మాత్రమే రావడంతో వరుసగా రెండోసారి ప్రతిపక్ష హోదాకు దూరమైంది.