1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్ కు ఏటా లక్షల మంది బతికేందుకు వస్తున్నారని అన్నారు. వారి అవసరాలు తీర్చేలా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)గా ఉన్నప్పుడు నగర విస్తీర్ణం కేవలం 160 చదరపు కిలోమీటర్లే ఉందని, కానీ, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలనూ కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)గా మారిస్తే దాని పరిధి 625 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. నగరంలో రోజూ 1,950 ఎంఎల్ డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతోందని, అందులో 772 ఎంఎల్ డీలను జలమండలి శుద్ధి చేస్తోందని పేర్కొన్నారు. సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని చెప్పిన ఆయన.. ఫతేనగర్ లో రూ.1,280 కోట్లతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, గతంలో మంచినీళ్లు, మురుగునీటి పైపులు కలిసిపోయాయని, దాంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ గుర్తు చేశారు. 17 ఎస్టీపీల స్థాపిత సామర్థ్యం 376.5 ఎంఎల్‌డీలు. దాదాపుగా 55 నుంచి 60 శాతానికి ట్రీట్‌మెంట్‌కు పోతాం. మరో 40 శాతం మిగిలి ఉంటుంది. ఆ 40 శాతాన్ని పూర్తి చేసేందుకు మరిన్ని ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామన్నారు.
కూకట్‌పల్లి సర్కిల్‌లోని ప్రగతి నగర్‌లో ఉండే అంబీర్ చెరువు మీద ఒకటి, చిన్న మైసమ్మ చెరువు వద్ద, నల్ల చెరువు, ఖాజాకుంట, ఎల్లమ్మకుంట చెరువు, ఫతేనగర్‌లోని నాలా మీద ఎస్టీపీలు నిర్మిస్తామన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో వెన్నలగడ్డ, చింతల్ డివిజన్‌లోని గాయత్రీనగర్ వద్ద, ఫాక్స్ సాగర్ చెరువు వద్ద, శివాలయ నగర్ చెరువు వద్ద, పరికి చెరువు వద్ద ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో మియాపూర్‌లోని పటేల్ చెరువు వద్ద, గంగారం చెరువు వద్ద, ముల్లకత్తువా చెరువు వద్ద, కాముని చెరువు వద్ద, దుర్గం చెరువు వద్ద, ఖాజాగూడ చెరువు వద్ద ఎస్టీపీలను నిర్మిస్తామన్నారు.