భారత స్వాతంత్రోద్యమంలో ముందున్న వారిలో ఒకరు గోపాల కృష్ణ గోఖలే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా,సామాజిక-రాజకీయ సంస్కరణలు తేవడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి ఎనలేని కృషిచేసిన గొప్ప నాయకుడు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించి తన భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయారు.
1866 మే 9న బొంబాయి ప్రెసిడెన్సీ ప్రస్తుత (మహారాష్ట్ర)లో కృష్ణారావు,వాలుబాయి దంపతులకు జన్మించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి భారతీయులలో గోఖలే ఒకరు. 1905లో “సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ”ని స్థాపించారు. 1889లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరిన ఆయన 1905లో బెనారస్ సెషన్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. భారతీయులకు ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని , సివిల్ సర్వీసెస్‌లో ఎక్కువ సంఖ్యలో భారతీయులను చేర్చుకోవాలని ఉద్యమాలు చేశారు.
Also Read:స్వాతంత్య్ర స్పూర్తిని నింపిన నేతాజీ..
గోఖలే తన జీవితాన్ని దేశం కోసమే అంకితం చేశారు. 1909 నాటి మింటో-మోర్లీ సంస్కరణల ఏర్పాటులో గోఖలే కీలకపాత్ర పోషించారు మితవాద వర్గానికి గోఖలే నాయకత్వం వహించగా, తిలక్ అతివాద వర్గానికి నాయకత్వం వహించాడు.విద్యతోనే ప్రజల్లో చైతన్యం వస్తుందని ఆ దిశగా మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
గోఖలే కృషితో ఉచిత నిర్బంధ విద్యా బిల్లు ద్వారా ప్రతిపాదించబడింది. ఇది ఒక శతాబ్దం తర్వాత విద్యా హక్కు చట్టంగా మార్పుచెందింది. గోఖలే ఎప్పుడూ వ్యక్తిగత కీర్తి , అధికారాన్ని కోరుకోలేదు. తన ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జీవితాన్ని అంకితం చేశాడు. జీవితాంతం ప్రజల కోసం పోరాడిన గోఖలే అనారోగ్యంతో 1915 ఫిబ్రవరి 19న కన్నుమూశారు.
Also Read: అహింసే మహాత్ముడి…ఆయుధం