ప్రాణవాయువుకే మళ్లీ ఆయువు పోసిన అద్భుత దృశ్యం…

98
- Advertisement -

చెట్టుకు మనిషికి ప్రాణవాయువు అందిస్తూ ఆయువును పెంచుతుందనీ మనందరికీ తెలుసు. భారీ వర్షాలకు నేలకూలి కోన ఊపిరితో ప్రాణవాయువును ఇచ్చే మహా వృక్షానికే ఆయువు పోయాలన్న ఓ యువకుడి సంకల్పం రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశీస్సులు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవ, జిల్లా కలెక్టర్ సహకారంతో నెరవేరింది. సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుకభాగంలో ఆదివారం అర్ధరాత్రి ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతం అయి…ప్రాణవాయువు కే తిరిగి ఆయువు పోసిన అద్భుత దృశ్యం…. సిరిసిల్ల వేదికగా సాక్షాత్కరించింది.

వివరాల్లోకి వెళితే… నాలుగు నెలల క్రితం గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు జిల్లాలోని కోనారావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులో బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ ల వ్యవసాయ క్షేత్రంలో ఉన్న70 ఎండ్ల మర్రి చెట్టు కూకటి వేళ్ళతో పెకిలి పోయింది. నీరు అందక కొద్ది రోజులకు మర్రి చెట్టు మోడుగా మారింది. చూపరులకు నిర్జీవంగా దర్శనం ఇచ్చింది.

అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు, వృక్షో రక్షతి రక్షితః అనే మాటలను త్రికరణ శుద్ధిగా నమ్మే వ్యక్తి డాక్టర్ దొబ్బల ప్రకాష్ ఈ దృశ్యాన్ని చూశాడు. మొన్నటి వరకూ… మహా వృక్షంగా టివిగా నిలబడి ఎంతో మందికి నీడ నిచ్చి .. ప్రాణులు, పక్షులకు గూడు గా నిలిచిన చెట్టే ప్రకృతి వైపరీత్యానికి నిస్సహాయంగా, నిర్జీవంగా ఉండడం చూసి కలత చెందాడు. ఆయువు తీరిందని ప్రజలు భావిస్తున్న మర్రి చెట్టుకు నీటిని అందిస్తే మర్రి వృక్షానికి ఆయువు తిరిగి పోయవచ్చు అని భావించాడు. అనుకున్నదే తడవుగా… రైతు బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్‌లతో మాట్లాడాడు. మోడు వారిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసి ఇక్కడ నుంచే మరో చోటికి తరలిస్తాననీ తెలిపాడు. పక్కనే గల రైతు దొబ్బల దాస్ వ్యవసాయ క్షేత్రం లోని బావి నీటిని వాడుకునేందుకు నీటినీ వాడుకునేందుకు అనుమతి తీసుకున్నాడు.

తాను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చెట్టుకు నీటిని అందించాడు. ప్రకాష్ కృషి ఫలించింది. క్రమంగా చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. ఆ విషయాన్ని గమనించిన ప్రకాష్ ద్విగుణీకృత ఉత్సాహంతో రెండు నెలల పాటు నీటిని పట్టాడు. ఇంకా కొనసాగించాడు. ఫలితంగా మోడు వారిన చెట్టు చిగురించిన ఆకులతో పచ్చగా దర్శనం ఇచ్చింది. చెట్టు వేళ్ళు బయటకి రావడంతో… వెళ్లకు ఉన్న మట్టిని తడపడం ద్వారా చెట్టుకు ప్రకాష్ ప్రాణం పోశారు. అయితే వేళ్ళు బయట ఉండడంతో నీరు పడుతుంటే మట్టి కొద్ది కొద్దిగా ఊడి పోతుంది.చాలా కాలం ఇలాగే ఉంటే మట్టి పూర్తిగా తొలగి పోయి చెట్టు చనిపోయే ప్రమాదం ఉందని … అలా అయితే 70 ఎండ్ల చెట్టు ఆయువు శాశ్వతంగా పోతుందని ప్రకాష్ ఆందోళన చెందాడు. అలా జరగకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా మర్రి చెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో ఒకచోట నుంచి మరోచోటకు తరలించి నాటడమే పరిష్కార మార్గం అని భావించారు.

దాతల కోసం ఎదురు చూపు….

మర్రి చెట్టు ను తమ గ్రామంలోని స్కూల్ కు తరలించి విద్యార్థులకు నీడ నిచ్చేలా ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలన్నది ప్రకాష్ ఆలోచన. ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలంటే చెట్టును ట్రిమ్ చేయడం, లిఫ్ట్ చేయడం, వాహనంలో తరలించడం, తిరిగి నాటడం చేయాలి. అందుకు భారీ ఖర్చు అవుతుంది. మర్రి చెట్టు కు ప్రాణ మైతే పోయగలిగాడు గానీ.. అంత ఖర్చు ను వెచ్చించే డబ్బు తన వద్ద లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు నుంచి ఆశించిన స్పందన రాలేదు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే… 100 ఎండ్ల వయస్సు ఉన్న మర్రి చెట్టు కుట్రాన్స్ ప్లాంటేషన్ తిరిగి ప్రాణం పోయాలని భావించారు.

ఆ విషయాన్నీ జిల్లా వాసి, సిద్దిపేట ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథంతో పంచుకున్నారు. మర్రి వృక్షం మళ్ళీ బ్రతికించాలి అన్న ప్రకాష్ పట్టుదలను గమనించి… ” ప్రకాష్ తపన ను వివరిస్తూ… మర్రి వృక్షం పై కథనాలు రాసి మీడియాకు అందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను ఈ కథనం ఆకర్షించింది. పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

మీడియా లో వచ్చిన కథనాలను … రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ చూసారు. అప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టిన తెలంగాణా కు హరిత హరం స్ఫూర్తితో దేశాన్ని హరిత భారత్ చేయాలన్న సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టించి దేశ వ్యాప్తంగా లక్షలాది మొక్కలను నాటుతూ… ప్రజల్లో హరిత ప్రాధాన్యం తెలియజేస్తూ చైతన్యం తీసుకువస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కు చెట్టును బ్రతికించిందేకు ఓ యువకుడి చేస్తున్న ప్రయత్నం ఎంతగానో కదిలించింది.

ప్రకృతి ప్రకాష్ కృషీకి ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ అభినందన, బాధ్యత తీసుకుంటానని ట్విట్టర్ వేదికగా హామీ మోడు వారిన మర్రి చెట్టు ను చిగురింప జేసిన ప్రకృతి ప్రకాష్ కృషీనీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. సంపూర్ణ దృఢత్వం, సంకల్పం, మీ లక్ష్యంపై మీకు స్పష్టమైన దృష్టి ఉన్నప్పుడు, ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ బృహత్తర #చెట్టుకు #పునర్జన్మ రావడానికి సహాయం చేసిన శ్రీ #ప్రకృతిప్రకాష్ కృషిని అభినందిస్తున్నాను. ఈ చెట్టును సురక్షితమైన ఇంటికి మార్చడం ఇప్పుడు నా బాధ్యత… అంటూ… పార్లమెంట్ సభ్యులు డిసెంబర్ 17వ తేదీన జోగినపల్లి సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.

రంగంలోకి వాటా సభ్యులు..

హామీ ఇచ్చినట్టు గానే పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వాటా వ్యవస్థాపకులు ఉదయ్‌ కృష్ణ పెద్దిరెడ్డి నేతృత్వంలో వాటా సభ్యులు మధన్‌ సోమాద్రి, నిషా ఖురానా, శ్రీనివాస్‌ గౌడ్‌, రామ్‌ కుమార్‌ పుచ్చ, కరుణ్‌ నిమ్మకామల,ప్రకాశ్‌ గాజుల రంగంలోకి దించారు. వారం రోజులు సభ్యులు శ్రమించి మొదట చెట్టు కొమ్మలను తొలగించారు. చేట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ కు సిద్దం చేశారు.

అసలు సవాలు ఎదురైంది ఇక్కడే చెట్టును ట్రిమ్ చేశారు… కానీ భారీ వృక్షాన్ని తరలించడం సవాలుగా మారింది. కొనారావు పేట మండలం సుద్దాల గ్రామం నుండి జిల్లా కేంద్రం అయిన సిరిసిల్ల లోని నూతన కలెక్టరేట్ ( వెనుకభాగం) లోని నిర్దేశిత స్థలంకు సుమారు 6 కిలో మీటర్లు తరలించడం కష్టంగా మారింది. ఎలా తరలించాలి అన్న అంశంపై నిపుణులు ఆ ప్రాంతాన్ని సందర్శించి మేదో మథనం చేశారు. వృక్షాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మించాలని భావించారు. ప్రత్యేక రోడ్డున యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. తరలింపుకు భారీ వాహనాలు కావాలి. 100 టన్నుల చెట్టును ఎత్తి వాహనంపై పెట్టేందుకు భారీ వాహనాలు కావాలి. మొదట 50 టన్నుల సామర్థ్యం గల క్రేన్ తెచ్చారు. అనంతరం 70 టన్నుల సామర్థ్యం గల క్రేన్ తెచ్చారు. రెండు సందర్భాలలో నూ చెట్టును ఎత్తడం సాధ్యం కాలేదు. చివరి 70 టన్నులు గల రెండు క్రేన్ లు తెచ్చి సఫలం అయ్యారు. దీనికి నెల రోజుల పాటు సమయం పట్టిందంటే క్షేత్ర స్థాయిలో లక్ష్య సాధనకు ఎంతగానో శ్రమించారోఅర్థం చేసుకోవచ్చు.

మిషన్ సక్సెస్.. సంకల్పం నెరవేరిందిలా…

చెట్టును తరలించేందుకు అంతా సిద్ధం అయ్యింది. ఆదివారం సుద్దాలలో ఉదయం 08.00 గంటలకు చెట్టును వాహనంలోకి ఎత్తి ఉదయం 10.00 గంటలకు కలెక్టరేట్ కు చేర్చాలన్నది ప్రణాళిక. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి నప్పటికీ లక్ష్య సాధన అంత సులభంగా జరగలేదు. ఉదయం 10.00 గంటలకు సుద్దాలలో మర్రి చెట్టును తరలించేందుకు సిద్ధం చేసిన వాహనంలోకి ఎత్తారు. ఆదివారం అర్థరాత్రి సుమారు 12.10 నిమిషాలకు మర్రి వృక్షం ను ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి చెట్టుకు తిరిగి ప్రాణం పోశారు. భారీ మర్రి వృక్షం ట్రాన్స్ ప్లాంటేషన్ కు ముందే మర్రి చెట్టుకు చెందిన రెండు పెద్ద కొమ్మలను ప్రధాన చెట్టు నుంచి వేరు చేసి… రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పరిధిలోని జిల్లెల్ల అటవీ ప్రాంతంలో క్రేన్ ల సహాయంతో నాటారు.

ట్రాన్స్ ప్లాంటేషన్ పై ఎంపి ప్రత్యేక దృష్టి..

మర్రి వృక్షం ట్రాన్స్ ప్లాంటేషన్ పై పార్లమెంట్ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. చెట్టు బాధ్యత తీసుకున్నప్పటి నుండి పలు మార్లు ప్రకృతి ప్రకాష్ తో మాట్లాడారు. క్షేత్ర పురోగతిని తెలుసుకున్నారు. ఆదివారం రోజు ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రగతి నీ తెలుసుకుంటూ… ప్రతి బంధకాలను పరిష్కారం చేస్తూ.. ప్లాంటేషన్ కు మార్గం చేశారు. చెట్టు ప్లాంటేషన్ పనులను ప్రతి రోజూ ప్రకాష్ ను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కో-ఫౌండర్‌ రాఘవ తెలుసుకుంటూ..ఎంపి కి సమాచారం అందించారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ..

రాష్ట్ర మంత్రి కేటిఆర్ ఆశీస్సుల వల్లే మర్రి వృక్షం ట్రాన్స్ ప్లాంటేషన్ కు మార్గం సుగమం అయ్యిందని పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. చెట్లు ఉంటేనే మానవ మనుగడ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాటలను త్రికరణ శుద్ధిగా నమ్మి సవాలుతో కూడిన ప్లాంటేషన్ ను చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. సహకరించిన జిల్లా కలెక్టర్, VATA సభ్యులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. చెట్టును బ్రతికించాలి అన్న ప్రకాష్ ఆశయం గొప్పదని ప్రశంసించారు.

డా. ప్రకృతి ప్రకాష్ మాట్లడుతూ.. వందెండ్ల మఱ్ఱి చెట్టుకు తిరిగి ప్రాణం పోయాలన్న ఆశతోనే… మోడు వారిన చెట్టు ను చిగురింప జేసా…. శాశ్వతంగా ప్రాణం పోసే స్థాయి నాకు లేక మదన పడ్డా…మీడియా ద్వారా ఎంపీ సార్ చెంతకు చేరడం తానే స్వయంగా బాధ్యత తీసుకోవడం…అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేశారు. ప్రాణం వాయువు ఇచ్చే చెట్టుకు ఆయువు పోసిన ఎంపీ సంతోష్ కుమార్ సార్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్న అన్నారు.

- Advertisement -