తెలంగాణలో త్వరలో మరో పదవుల పందేరానికి రంగం సిద్ధమవుతోంది. ఈ జాన్ నెలలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇవన్నీ దాదాపుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలే కావడం గమనార్హం. ఏప్రిల్ నెలాఖర్ లేదా మే మొదటి వారంలో ఈ ఎమ్మెల్సీ పదవుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది, మండలిలో పదవి కాలం ముగుస్తున్న వారిలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, ఫరీదీద్దున్, బోండకంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ప్రస్తుత తెలంగాణ భవన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇందులో మళ్లీ ఎంత మందికి సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తారనేది టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఎమ్మెల్సీ పదవులకై గులాబీ నేతలు చాలా మందే పోటీపడుతున్నారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి , ఫరీదుద్దీన్, ఆకుల లలితకు మరో అవకాశం ఇస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, శ్రీనివాస్ రెడ్డిలకు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనే విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖమంత్రిగా కీ రోల్ పోషించిన కడియంశ్రీహరికి సెకండ్ టర్మ్‌లో మంత్రిగా ఛాన్స్ రాలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఓ దశలో కడియం బీజేపీలోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రాజయ్యతో జరుగుతున్న వివాదం నేపథ్యంలో కడియం శ్రీహరికి మరో సారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారా లేదా అనేది సీఎం కేసీఆర్ డిసెషన్పై ఆధారపడి ఉంది. ఇక మైనారిటీ కోటా కింద ఫరీదీద్దున్కు మళ్లీ అవకాశం ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతి విద్యాసాగర్ కు మాత్రం మరో ఛాన్స్ కష్టమే అంటున్నారు. తెలంగాణ భవన్ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డికి కూడా మళ్లీ అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ రావొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు మరో వాదన వినిపిస్తుంది. కాగా ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి వర్గంలో ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షర్మిల పార్టీలోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తుమ్మలకు బదులుగా పొంగులేటిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారంటూ ఖమ్మం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి తుమ్మల విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో విశ్వబ్రాహ్మణ, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, పద్మశాలీ సామాజికవర్గాల నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ఎమ్మెల్సీ టికెట్ పక్కా అంటున్నారు. అటు గుండు సుధారాణి కూడా ఎమ్మెల్సీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నరు. ఉమ్మడి వరంగ్ జిల్లాకు చెందిన తక్కెళ్ల రవీందర్‌కుమార్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులుపై టీఆర్ఎస్లో చాలా మంది నేతలు భారీగా అశలు పెట్టుకున్నారు. మరి ఆశావహుల్లో ఎవరెవరికి సీఎం కేసీఆర్ ఛాన్స్ ఇస్తారో అనేది చూడాలి.