యూపీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగగా దాదాపు 62.08 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.మొత్తం 25వేల 880 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగ్గా మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా 138 పింక్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
తొలివిడతలో మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో అధికార బీజేపీ ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు ఉండగా.. వారి భవిష్యత్తు ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. తొలిదశలో మొత్తంగా 2.27కోట్ల మంది ఓటర్లు పాల్గొనాల్సి ఉండగా.. వీరిలో 60శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొదటి విడతలో భాగంగా లక్షమంది పోలీసుల సిబ్బంది, హోంగార్డులు విధుల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరితోపాటు మరో 800 కంపెనీల కేంద్ర బలగాలను విధుల్లో పాల్గొన్నాయని తెలిపారు.