కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం..రాష్ట్రంలో ఇప్పటివరకు 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్…రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు గుంపులు గుంపులుగా పొవద్దన్నారు.
ప్రపంచంలో ఇప్పటివరకు కరోనాకు మందు లేదని చెప్పారు. రాష్ట్రంలో 20 వేల మంది స్వీయ నిర్బందంలో ఉన్నారని చెప్పారు.ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. హాస్టళ్లు ఎట్టి పరిస్థితుల్లో మూసివేయరని…ఏపీకి చెందిన విద్యార్ధులు ఆందోళన చెందవద్దన్నారు.
కరోనా నివారణకు ఏకైక మార్గం స్వీయ నియంత్రణే అన్నారు. గుంపులు గుంపులుగా ప్రజలు ఉండకూడదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అన్నారు.
కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఏ అవసరం ఉన్న సహకారం అందిస్తామని ప్రధాని మోడీ తనతో చెప్పారని తెలిపారు సీఎం. ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకునేలా సంత్ర,బత్తాయిలు లాంటి పండ్లని తినాలన్నారు.
ఒక్కొక్క దశలో నాలుగువేల మంది ఐసోలేషన్ వార్డులో ఉండేలా మూడు దశల్లో పేషెంట్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. 12 వేల 400 మంది ఐసోలేషన్‌లో ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. 60 వేల మందికి పాజిటివ్ అని తేలినా ట్రీట్ మెంట్ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. రిటైర్డ్ డాక్టర్ల సేవలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ,పోలీస్ సిబ్బందికి ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. సామాజిక దూరంతోనే కరోనాకు అడ్డుకట్ట వేయగలుగుతామని చెప్పారు. తెలంగాణలో ఉన్న ఏ ప్రాంతం,రాష్ట్రం వాళ్లైనా వారిని ఉపవాసం ఉండనీయమన్నారు. ఎవరు అందోళన చెందవద్దన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయన్నారు. పంటలను కాపాడితెనే రైతులు బాగుపడతారని చెప్పారు.రైతులు తమ పంటలను పట్టణాల మార్కెట్ యార్డుల్లోకి తీసుకురావొద్దన్నారు. దీనికి గ్రామ రైతు సమన్వయ సమితులు కీలక బాధ్యత పోషించాలన్నారు.