ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి గూడెంలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైసీపీఎల్పీ భేటీలో మాట్లాడిన ఆయన కేబినెట్ విస్తరణలో భాగంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలు నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించారు.
మొత‍్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు జగన్ వెల్లడించారు. కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలంతా మనవైపు చూస్తున్నారని తెలిపిన ఏపీ సీఎం మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలన్నారు. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో జగన్ చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. అత్యంత ఉన్నత స్థానాల్లో సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.