గోదావరిలో పడవ ప్రమాదం. ప్రయాణికులతో వెళ్తున్న నాటు పడవ గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద చోటుచేసుకుంది. బోల్తా పడిన నాటుపడవలో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గ్రామస్థులు వీరిలో సుమారు 26 మందిని కాపాడారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. నాటుపడవ సలాదివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరి వెళ్తుండగా నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌కు తగిలి ప్రమాదం జరిగినట్లు సమాచారం.
స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని సమీక్షిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రానికి దగ్గరగా ఉండే వృద్ధ గౌతమి పాయ వద్ద ఈ ఘటన జరిగింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధవళేశ్వరం నుంచి వస్తున్న వరద నీరంతా దిగువకు ఈ రేవు గుండానే వెళ్లి సముద్రంలో కలుస్తుందని అక్కడివారు చెబుతున్నారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.