రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున యాదాద్రికి నలువైపులా నాలుగు లేన్ల రింగు రోడ్డు, ప్రదక్షిణ మార్గాలను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు నిర్దేశించారు. తెలంగాణలో యాదాద్రి అతి ముఖ్యమైన ఆలయమని..దేశంలోనే అత్యంత అద్భుత దేవాలయంగా యాదాద్రిని తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇవాళ అధికారిక నివాసంలో యాదాద్రి అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ యాదాద్రి దేవాలయ అభివృద్ధి పనుల నిర్మాణంలో పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వైటీడీఏ ఆధ్వర్యంలో టెంపుల్ సిటీ మాస్టర్‌ప్లాన్ రూపొందించాలి. ఆధ్యాత్మిక, భక్తి భావన, పవిత్రత, ప్రకృతి రమణీయత, పర్యాటక ప్రాముఖ్యత ఉట్టిపడేలా యాదాద్రికి నవరూపం ఇవ్వాలి. ఇటీవలి కాలంలో యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు రోజుల్లో, ప్రత్యేక సందర్భాల్లో లక్ష మందికి పైగా భక్తులు వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా యాదాద్రిలో ఏర్పాట్లు చేయాలి. ఒకే రోజు లక్షమంది భక్తులు వచ్చినా సాఫీగా దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలి.
భక్తులకు మంచి వసతి దొరికేలా..ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే గుట్టపై అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు నిర్మించాలి. ఈశాన్య భాగంలో 13ఎకరాల విస్తీర్ణంలోని గుట్టపై ప్రెసిడెంట్ సూట్ నిర్మించాలి. ఇప్పుడున్న బస్టాండ్, బస్ డిపోను మరో చోటికి మార్చాలి. యాదాద్రిలో పోలీస్, ఫైర్, హెల్త్ సేవలను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.
యాదాద్రిని గొప్పంగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు కేటాయించాం. కావాల్సినంత భూమిని సేకరించినం. ఇక మంచి ప్రణాళికతో నిర్మాణాలు చేపట్టడమే మిగిలింది. తొందరపాటుకు తావివ్వకుండా ప్రతీ అంశంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలి. దేశంలో వివిధ దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవలను అధ్యయనం చేసేందుకు అధికారులు, ఆలయ నిర్మాణ శిల్పులు, రూపకర్తలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి సూచనలివ్వాలి.
లక్ష్మీ నరసింహ స్వామికి 32 అవతారాలున్నాయి. అన్ని అవతారాలు యాదాద్రిలో ఉండాలి. అవతారాల విగ్రహాలను ఎక్కడ ప్రతిష్టించాలి. ఏ పద్దతిన ఏర్పాటు చేయాలనే విషయంలో ఆధ్యాత్మిక పెద్దల సలహాలు తీసుకోవాలి. యాదాద్రిలో వివిధ ప్రదేశాలకు దైవ నామాలను పెట్టడం వల్ల భక్తులు అన్యాపదేశంగా దైవ స్మరణ చేస్తారు. ఆలయ ప్రాంగణమంతా దైవస్ర్తోత్రాలు, కీర్తనలు వినిపించేలా సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. గతంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కీర్తనలుండేవి. ప్రత్యేక వాగ్గేయకారులుండేవారు. మళ్లీ గుర్తించి మనుగడలోకి తీసుకురావాలి.
గుట్ట కింద నుంచి పైకి భక్తులను తీసుకుపోవడానికి ఆలయం ఆధ్వర్యంలోనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి. వచ్చి పోవడానికి వేర్వేరు మార్గాలు నిర్మించాలి. మెట్లను కూడా బాగా మెరుగుపర్చాలి. ప్రతీ మార్గానికి రెండు వైపులా, ప్రధాన గుట్టపై అందమైన ప్రకృతి దృశ్యం ఆవిష్కృతం కావాలి. సువాసనలు వెదజల్లే, ఆకర్షణీయమైన చెట్లు పెంచాలి. భక్తులకు క్యూలైన్లలో ఆహారం, పానీయాలు అందించాలి. దేవాలయ అభివృద్ధి పనులకు గుట్టపైన, కింద వ్యాపారస్తులు సహకరించారు. వారి జీవనోపాధి గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ నిర్దేశించారు.