సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఆర్‌టీఏ కార్యాలయం వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని లాలాపేటకు చెందిన ఎండీ అజార్(37), ఇమ్రానాబేగం(35) దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఓ కార్యక్రమానికి హాజరై… అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు. వారి వాహనం ఆర్‌టీఏ కార్యాలయం వద్ద మలుపు తీసుకుంటుండగా… జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపు వాహనం (ఎపీ24వీ5893) వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆజర్(37), అమన్(9), అశ్వియా(7), అలీనా(3) అక్కడికక్కడే చనిపోయారు.
ప్రాణాలతో బయటపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాహన డ్రైవరు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా అదేసమయంలో ఆర్మూర్ నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ ఘటనా స్థలం వద్ద ఆగి, తన కాన్వాయ్‌లోని ఒక వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మేయర్ బొంతు రామ్మోహన్ ,మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను మేయర్ ఆదేశించారు. మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.