దేశమంతా ఇపుడు రిలయన్స్ జియో ఫీవర్ పట్టుకుంది. ఇంటర్నెట్ డాటా, కాల్స్ ఉచితం అనడంతో హైదరాబాద్‌లో జియో సిమ్‌ల కోసం రిలయన్స్ స్టోర్ల ముందు భారీ క్యూలు దర్శనం ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరూ రిలయన్స్ జియో సిమ్ తీసుకోవాలని 90 రోజులు పుల్ గా ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే 3జీ ఫోన్లకు రిలయన్స్ జియో సపోర్ట్ చేస్తుందా అని చాలామందికి సందేహం ఉంది. ఇప్పటికే అన్ని 4జీ స్మార్ట్ ఫోన్లకు జియో సిమ్ లు ఎలా వాడాలనే విషయం తెలిసే ఉంటుంది.

అయితే 3జీ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఈ జియో పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా పనిచేయదు అని చెబుతున్నారు విశ్లేషకులు. రిలయన్స్ స్టోర్లలో సిబ్బంది జియో సిమ్ తీసుకునే ముందు.. ఆ ఫోన్‌లోఐఈఎంఐ నంబర్ సరిచూసుకున్న తరువాతనే జియో సిమ్‌లను జారీ చేస్తున్నారు. అంటే స్మార్ట్ ఫోన్ అయినంతా మాత్రానా మీరు జియో సిమ్ పొందలేరు. మీ ఫోన్ 4జీ వోల్టీ సర్వీసులను సపోర్టు చేస్తేనే మీకు జియో సిమ్ దొరుకుతుంది. దీంతో ఉచిత ఇంటర్నెట్ సర్వీసులను వాడుకోవాలంటే తప్పకుండా 4జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లను కొనితీరాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం వోల్టీ పరిజ్ఞానంతో మార్కెట్‌లోకి చాలా మొబైళ్లు అందుబాటులోకి వచ్చాయి. లైఫ్, శామ్‌సంగ్, లెనోవో, ఎల్జీ, మోటోరోలా, లావా, మైక్రోమ్యాక్స్, ఆసుస్, జియోని, కార్బన్, పానాసోనిక్ వంటి సంస్థలు వీటిని అందిస్తు న్నాయి. రూ.2999 మొదలుకుని రూ.50వేల దాక దాదాపు 150 మోడళ్లు వరకు అందుబాటులో ఉన్నాయి.
ఇక రిలయన్స్ స్టోర్లలో వచ్చిన సిమ్‌లు వచ్చినవి వచ్చినట్టుగా అమ్ముడవుతున్నాయి. కస్టమర్లకు సిమ్‌లను ఇవ్వలేక రిలయన్స్ సిబ్బంది వారం నుండి మూడు వారాల వరకు టోకెన్లు జారీ చేస్తున్నారు. సిమ్ కోసం మళ్లీ మళ్లీ రావాలా అని కస్టమర్లు వాపోతున్నారు. అయినా తప్పదన్నట్లు టోకెన్ తీసుకొని వెళ్లిపోతున్నారు. ఇంకొందరు టోకెన్ వచ్చే వరకు ఎదురు చూడకుండా జియో సిమ్‌లను బ్లాక్‌లో కొనేందుకు ఎగబడుతున్నారు. ఒక్కో సిమ్ రూ.500 నుంచి రూ.1000 దాకా చెబుతున్నా హాట్‌కేకుల్లా కొనేస్తున్నారు.

జనవరి నుంచి జియో ప్యాకేజీలు ఎంత తక్కువగా అందుబాటులోకి రాబోతున్నాయో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించాక జియో సిమ్‌లకు డిమాండ్ మరింత పెరిగింది. దీంతో బ్లాక్‌మార్కెటీర్లే కాదు.. సెల్‌ఫోన్ విక్రయదారుల్లో సైతం కొందరు కొండెక్కి కూర్చుంటున్నారు. జియో గురించి అంతగా వివరాలు తెలియనవారు వచ్చి వాటి గురించి ఆరా తీస్తే సిమ్ ఖరీదు రూ.500 అని చెబుతున్నారు. కాగా, సెప్టెంబర్ 5 నుండి జియో సేవలు ప్రారంభమవుతాయని ముఖేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. జియో దెబ్బకు ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్లు కుదేలయ్యాయి. రిలయన్స్ ఆఫీషియల్‌గా లాంచ్ అయితే ఇంకెన్నీ సంచలనాలు నమోదవుతాయో చూడాల్సిందే.

