ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చటంతో పాటు… నైపుణ్యాల అభివృద్ధి చిరునామాగా తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే సాంకేతిక నైపుణ్యాలు నేర్పించే గమ్యస్థానంగా హైదరాబాద్ ను విశ్వ వేదికపై నిలబెట్టేందుకు అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
తెలంగాణలో గత పదేండ్లలో నిరుద్యోగం పెరిగిందని, గత పదేండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదని అన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లోనే 30 లక్షల మంది నమోదు చేసుకున్నారని, రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజా ప్రభుత్వం గుర్తించిందని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో 35 వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
బుధవారం ఉదయం మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూ ఆడిటోరియంలో రాష్ట్రంలోని 38 కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ప్రతినిధులు మమతా మాదిరెడ్డి, రమేష్ ఖాజా, ఎక్విప్ సంస్థ ప్రతినిధులు హేమంత్ గుప్తా, జి.సాయికిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న యువతను తయారు చేసి.. ఉపాధికి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో చర్చలు జరిపామని, వారు ఇచ్చిన ప్రతిపాదనలతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు డిగ్రీలో చేరిన పది వేల మంది డిగ్రీ విద్యార్థులు తమ పట్టా పొందే నాటికి నైపుణ్యాన్ని నేర్చుకునేలా ఈ ప్రోగ్రాం రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ శిక్షణ పొందిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలకు ఢోకా ఉండదని అన్నారు. అవసరమైన నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎక్విప్ సంస్థను, ఈ కోర్సు సిలబస్ను రూపొందించిన బీఆర్ఎస్ఎఫ్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రతిభ ఉన్నా, నైపుణ్యం లేకపోతే యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కవని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఏటా మూడు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొంది కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, కానీ ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించిన నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అన్నారు. అటు పరిశ్రమలకు తమ సాంకేతిక నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కుంటున్నాయని అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని అన్నారు. అందులో భాగంగానే యువతకు నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
డిగ్రీలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్న్షిప్ కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జీ కూడా సమకూరుతుందని అన్నారు.
Also Read:ఇలా చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం.. పదిలం!