పాత పెద్దనోట్లు రద్దు చేసిన నేటికి సరిగ్గా 30రోజులయ్యింది. సామాన్యుల కష్టాలు తీరటం లేదు. పేద వారింట్లో ఏ శుభకార్యమూ జరగటంలేదు. నిర్ణయించుకున్న శుభకార్యాలను కూడా నగదు సమస్యతో వాయిదా వేసుకునే పరిస్థితులను సామాన్యులు ఎదుర్కొంటున్నారు.బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు..ఏటీఎంల వద్ద అవుటాఫ్ సర్వీస్ బోర్డు దర్శనిమిస్తూనే వున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న….క్యాష్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. దీంతో నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బందులు పడుతూనే వున్నారు.
‘దేశం కోసం భరించండి’ అని ప్రధాని మోడీ చెబుతున్నా…క్యాలెండర్లో రోజులు మారుతున్నా.. నోట్ల కష్టాలు మాత్రం ఎంతకూ తీరటం లేదు. దీంతో.. ఏం చేయాలో పాలుపోవటం లేదని పలువురు వాపోతున్నారు. పెద్ద పెద్ద మొత్తాలు.. అద్దెలు.. లాంటి వాటిని ఆన్ లైన్ ద్వారా పే చేస్తున్నప్పటికీ.. చిల్లర ఖర్చులకు నోట్లు తప్పనిసరి అయ్యాయి.దీంతో.. ఈ నోట్ల కష్టాలు ఎప్పటికి తీరేను? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
ఎప్పుడు విత్తనాలు, ఎరువులతో ఇబ్బంది పడే రైతులకు ఈ సారి కొత్తగా కరెన్సీ కష్టాలు వచ్చి పడ్డాయి. తమ దగ్గర ఉన్న పాత నోట్లు చెల్లకపోవడంతో విత్తనాలు కొనలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నెల రోజుల నుంచి పడుతున్న కష్టాలు మరో రెండు వారాలు పడటానికి సాధారణ ప్రజలు సిద్ధమే. కానీ.. అంతకు మించి అయితేనే..అసలు సమస్య అవుతుందని పలువురు వాపోతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పది వేల రూపాయల చొప్పున నగదు ఇస్తామని బ్యాంకులు హామీ ఇచ్చినా అది ఆచరణలో సాధ్యపడలేదు.అందరికి పదివేల చొప్పున నగదు ఇవ్వలేక బ్యాంకులు చేతులెత్తేశాయి. చేతిలో 2000 ఉన్నా కనీసం కూరగాయలు కొనుక్కోలేని దుస్థితి నెలకొంది.ఎక్కడ చూపినా చిల్లర, నోట్ల కష్టాల గురించి చర్చించుకుంటున్నారు. బ్యాంకుల దగ్గర క్యూలు చూస్తే భయం వేస్తుందని, ఏమిటో ఈ బాధలు.. ఉన్నవాళ్లు బాగానే ఉంటారని. లేని వాళ్లకు ఏమీ లేదని. ఏమొచ్చినా మధ్యతరగతి వాళ్లకే చిక్కులు అని పలువురు మండిపడుతున్నారు. ఇంట్లో ఉన్న ఒక్కో వంద ఖర్చవుతుంటే రేపటికి ఎలా అన్న భయం వెంటాడుతుందని ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.