శ్రీలంక‌లో మారణహోమం.. 290 మంది మృతి

266
Sri Lanka
- Advertisement -

శ్రీలంక‌లో మారణహోమం.. నిన్న కొలంబో సహా మూడు నగరాల్లో ఎనిమిది బాంబు పేలుళ్లు జ‌రిగాయి. క్రైస్తవులు, టూరిస్టులు లక్ష్యంగా చర్చిలు, ఫైవ్‌స్టార్ హోటళ్లపై దాడి ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారు. శ్రీలంక‌లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల మారణహోమంలో ఇప్పటివరకు 290 మంది మృతిచెందగా, 500 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డార‌ని శ్రీలంక పోలీస్ అధికార ప్ర‌తినిధి సోమ‌వారం తెలిపారు.

ఈ పేలుళ్ల‌తో సంబంధాలున్న‌ట్లు అనుమానిస్తున్న 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం వారిని ఉన్న‌తాధికారులు విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వివ‌రాలు తెలియ‌జేసేందుకు ఆయ‌న నిరాక‌రించారు. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఆదివారం జరిగిన ఈ ఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా సోమవారం ఉద‌యం 6 గంట‌ల‌కు ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూను ఎత్తివేసింది.

పేలుళ్ల ధాటికి మరణించిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు శ్రీలంకలోని భారత హై కమిషన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌ ఈ విషయం వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికి రమేశ్‌, లక్ష్మి, నారాయణ్‌ చంద్రశేఖర్‌, రెజీనా అనే నలుగురు భారతీయులు మృతి చెందారని ప్రకటించగా.. తాజాగా కేజీ హనుమంతరాయప్ప, ఎమ్‌ రంగప్ప అనే ఇద్దరు వ్యక్తులు కూడా మరణించినట్లు తెలిపారు. మొత్తం ఈ ఘటనలో 32 మంది విదేశీయులు మృతి చెందినట్లు సమాచారం.

- Advertisement -