ప్రపంచ తొలి స్లో మోషన్ మూకీ చిత్రం `కాలాయా తస్మై నమః`. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 26న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. వరల్డ్ రికార్డ్ గా రూపొందింన ఈ చిత్రం రేగం ఎంటర్ ప్రైజెస్ పతాకంపై శ్రీనివాస్.బి, విజయ్ కార్తీక్, వినయ్ కృష్ణ, శ్రీనివాస్ కడియాల సంయుక్తంగా నిర్మించారు. ఆర్. సాయి రమేష్ గౌడ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నరేష్ నాయుడు, రేఖ బోజ్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ…“నేను గతంలో లవ్ ఇన్ వైజాగ్, డర్టీ పిక్చర్, అనే షార్ట్ ఫిలింస్ డైరక్ట్ చేశాను. వీటికి దర్శకుడుగా నాకు మంచి పేరు వచ్చింది. తొలిసారిగా `కాలాయా తస్మై నమః` చిత్రానికి దర్శకత్వం వహించాను. స్లో మోషన్ లో చిత్రీకరణ జరుపుకున్న ప్రపంచ తొలి సినిమా ఇది. తెలుగులో పుష్పక విమానం తర్వాత పూర్తి స్థాయి మూకీ చిత్రం మాదే అని చెప్పవచ్చు. ఇది 1980లో గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. మనం ఏం కావాలి? అనేది కాలమే నిర్ణయిస్తుందన్న అంశంతో సినిమా నడుస్తుంది కాబట్టి `కాలాయా తస్మై నమః` అనే టైటిల్ పెట్టడం జరిగిందన్నారు.
లవ్, థ్రిల్లర్ , క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరణ జరిపాము. ఇందులో అందరూ షార్ట్ ఫిలింస్ లో నటించిన వారే నటించడం విశేషం. ఇటీవల సెన్సార్ పూర్తి చేశాము. సెన్సార్ సభ్యులు నిజంగా ఇది గొప్ప ప్రయత్నం అంటూ..ఎక్కడా మూకీ సినిమా అన్న భావన రాకుండా సినిమాలో లీనమై చూశామంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం మాలో చాలా ఉత్సాహాన్ని నింపింది. మా చిత్రాన్ని ఈ నెల 26న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. చిన్న చిత్రాలను ఆదరిస్తోన్న ఈ సమయంలో మా తొలి ప్రయోగాత్మక చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం“ అన్నారు.
నరేష్ నాయుడు, రేఖ బోజ్, ఎస్.ఎస్ శర్మ, సంజు సంజయ్, రాశి గవర్, శ్రీధ భట్, ఉదయ్ కుమార్, సానియా అస్లామ్, భరత్ జే తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః రామ్ నారాయణ్, కెమెరా, ఎడిటింగ్ః అజ్గర్ అలీ, కో-ప్రొడ్యూసర్స్ః వాసు, సతీష్, నిర్మాతలుః శ్రీనివాస్ బి, విజయ్ కార్తీక్, వినయ్ కృష్ణ, శ్రీనివాస్ కడియాల, రచన, నిర్దేశనః రాకేష్ రెడ్డి.