లెజెండ్రీ నటుడు నందమూరి తారకరామారావు,మోహన్ బాబు కలిసి నటించిన సినిమా మేజర్ చంద్రకాంత్. సరిగ్గా రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమలో మైలురాయిగా నిలిచింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చేసిన పవర్‌ఫుల్ క్యారెక్టర్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. నిర్మాతగా మోహన్ బాబుకు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అమ్రిష్ పురి, రమ్య కృష్ణ, నగ్మ, బ్రహ్మానందంలు కీలక పాత్రలు పోషించారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికి ఆల్ టైం హిట్ సినిమాలలో ఒక్కటిగా నిలిచింది. అంతేగాదు సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్. దేశభక్తి నేపథ్యంగా సాగే పుణ్యభూమి నాదేశం సాంగ్,డైలాగ్‌లు ఇప్పటికి మనకు వినిపిస్తునే ఉంటాయి. 1993లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా నేటితో సరిగ్గా విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఓ సందర్భంలో ఈ సినిమా తీయడానికి గల కారణాలను మోహన్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్ గారితో సినిమా తీయాలనుకొని ఆయన్ని అవకాశం ఇమ్మని అడగడానికి వెళ్లాను. నేను అలా అడగగానే అన్నగారు నేను ఎలక్షన్స్ లో ఓడిపోయాను. ఇప్పుడు నన్ను బిగ్ స్క్రీన్ పై ఎవరు చూస్తారు? అన్నారు. నేను ఎంతో పట్టుబట్టి ఒప్పించడంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది.
ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు అన్న గారికి 25 లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వబోతే ఆయన అంత తీసుకోకుండా కేవలం 2 లక్షలు మాత్రమే తీసుకొని ముందు సినిమా పూర్తి చెయ్యమన్నారు. అ తర్వాత ఫైనల్ అమౌంట్ నేను ఎంత ఇచ్చాను అనేది నాకు, ఎన్.టి.ఆర్ గారికి మాత్రమే తెలుసు అది సీక్రెట్’ అని అన్నారు.