ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాబా జై గురుదేవ్ సభ సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో వారణాసి, చందౌలి మధ్య రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.వీరిలో 14 మంది మహిళలున్నారు. 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 50 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయాలపాలై చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు.
రాజ్‌ఘాట్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగి పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడానికి ప్రధాన కారణాలను అధికారులు వెల్లడించారు. బాబా జైగురుదేవ్ సభకు మూడు వేల మందికి అనుమతి ఉంటే లక్షమంది హాజరయ్యారని, ఫలితంగా తీవ్ర తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సభ ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.