ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 22 మంది సజీవ దహనమయ్యారు. యూపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు-ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బరేలీ – సహజాన్‌పూర్ మధ్య ప్రమాదం చోటు చేసుకుంది. మరో 20 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు అంటుకోవడంతో మృతుల సంఖ్య పెరిగింది.
ట్రక్కును ఢీకొన్న బస్సు వెంటనే మంటల్లో చిక్కుకోవడంతో ప్రయాణికులకు కనీసం తప్పించుకునే అవకాశం దక్కలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలామంది నిద్రలో ఉన్నారనీ… మెలకువగా ఉన్నవారిలో కొంతమంది కిటీకీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మంటల వల్లే ఎక్కువ మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.