‘మాస్తిగుడి’ కన్నడ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ శాండల్‌వుడ్‌లో అంతులేని విషాదాన్ని నింపింది. నిలువెత్తు నిర్లక్ష్యం కొంప ముంచగా ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి వచ్చిన ఇద్దరు విలన్ల రంగుల కల చెదిరింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ప్రమాదంలో హీరో విజయ్ కూడా నీట మునిగిపోవాల్సిన వాడే. అదృష్టం బాగుండి సమీపంలోని మత్స్యకారుల తెప్ప కంట పడడంతో అతన్ని చివరి క్షణంలో కాపాడగలిగారు. ఈ లోపు మిగిలిన ఇద్దరిని కూడా కాపాడాలని భావించినా వారు ఈతరాక నీట మునిగారు.
చనిపోయిన ఇద్దరిలో ఉదయ్ మూడు రోజుల క్రితమే పెళ్ళి చూపులకు వెళ్ళివచ్చాడు. తన అక్క, చెల్లి వివాహాలు జరిపి తాను కూడా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నంతలోనే విధి అతన్ని జల సమాధి రూపంలో కాటేసింది. మరో విలన అనిల్‌కు వివాహమై ఇద్దరు బిడ్డలున్నారు. వీరిద్దరి అకాల మృతితో ఆధారం కోల్పోయిన వీరి కుటుంబాలు దిక్కులు పిక్కటిల్లేలా హృదయ విదారకరంగా రోదిస్తున్నాయి.
చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి దేహదారుడ్యాన్ని పెంచుకొని విలన్లుగా ఎదిగిన ఉదయ్, అనిల్‌లు.. ఒకేసారి కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. కన్నడ నాట అందరూ ప్రముఖ హీరోలతోనూ వీరు నటించారు. పలు చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు సృష్టించాయి. హెలికాప్టర్ నుంచి చెరువులోకి దూకే సన్నివేశ చిత్రీకరణ ముందు కూడా వీరిద్దరు విజయ్ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం పొందడం గమనార్హం.
అనిల్, ఉదయ్‌లకు ఈత రానప్పటికీ.. సహజత్వం కోసం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకుండానే దూకేయాలని స్టంట్ డైరెక్టర్ రవి వర్మ వీరిద్దరితో చెప్పాడని సమాచారం. స్టంట్ చేస్తుండగా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం.. ఉదయ్, అనిల్‌లకు లైఫ్ జాకెట్లు లేకపోవడంతోనే వారు మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకుండానే సన్నివేశాలను చిత్రీకరించడంపై రవివర్మపై కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇద్దరు గొప్ప విలన్లను కోల్పోవడం బాధగా ఉందని కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రి ఉమశ్రీ ఆవేదన చెందారు. అగ్ర నటులు డాక్టర్ శివరాజ్ కుమార్, కిచ్చ సుదీప్, జగ్గే్‌షలు కూడా ఈ దారుణ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.