పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వ సిబ్బందికి మరియు పదవీ విరమణ పొందిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) ను 2 శాతం పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాజా సవరణతో డీఏ ప్రాథమిక వేతనంలో ప్రస్తుతమున్న 58 శాతం నుండి 60 శాతానికి పెరుగుతుంది. ఈ పెంపు జనవరి 2026 నుండి అమలులోకి వస్తుంది. ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు కూడా ‘డియర్నెస్ రిలీఫ్’ (DR) రూపంలో ఇదే విధమైన పెంపు లభిస్తుంది. దీనివల్ల సుమారు ఒక కోటి మందికి పైగా లబ్ధి చేకూరనుంది.
ఈ పెంపుతో నెలవారీ ఆదాయంలో స్వల్ప పెరుగుదల ఉంటుంది. ఉదాహరణకు..ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) ₹30,000 ఉంటే, వారికి నెలకు అదనంగా సుమారు ₹600 లభిస్తుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు (జనవరి మరియు జూలైలో) డీఏను సవరిస్తుంది.
Also Read:ఎముకల బలహీనత..కారణాలివే!
పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించి ఈ పెంపును నిర్ణయిస్తారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నందున 2 శాతం పెంపును ఖరారు చేశారు.

