రామోజీ ఫిలిం సిటీలో..’1920 భీమునిపట్నం’

23
- Advertisement -

కంచర్ల ఉపేంద్ర అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “1920 భీమునిపట్నం”. అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరిగింది.

అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో హీరో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో హీరోయిన్ అపర్ణా దేవి కనిపిస్తారు. వీరిద్దరిపై కాంగ్రెస్ వాలంటీర్ల నేపథ్యంలో తీసిన ముహూర్తపు తొలి సన్నివేశానికి చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, “ఈ చిత్రంలోని సీతారాం, సుజాత పాత్రల మధ్య నడిచే ప్రేమకధను దర్శకుడు అద్భుతంగా తయారు చేశారు. ఆస్కార్ స్థాయికి తగట్టుగా తెరకెక్కించబోతున్నాం. సంగీతం, ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయి. 1920 నేపథ్యం కావడంతో నాటి అంశాలను ప్రతిభింబించాల్సిన ఆవశ్యకత ఉండటంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అయితే బావుంటుందని అనుకున్నాం. ఆ మేరకు ఆయనను సంప్రదించి, కథ చెప్పం. కథ నచ్చి, ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేస్తాం. రామోజీ ఫిలింసిటీలో పది రోజులపాటు షూటింగ్ చేసిన తర్వాత రాజమండ్రి , విశాఖపట్నం, అరకు, ఊటీలలో చిత్రీకరణ జరుపుతాం” అని అన్నారు.

దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, “భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్యేగాల మధ్య నడిచే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. వాటికి ప్రాణప్రతిష్ట చేసే నటీ నటులను ఎంపిక చేసుకున్నాం. మంచి అభిరుచి కలిగిన నిర్మాత ఈ ప్రాజెక్టును చేస్తుండటంతో అద్భుతమైన చిత్రంగా రూపుదిద్దుకుంటుందన్న నమ్మకం ఉంది” అని అన్నారు. .

హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, “తెలుగు సినిమా ఎప్పుడో ప్రంపంచ స్థాయికి చేరింది. దానిని నిలబెట్టే స్థాయి కలిగిన సినిమా. ఇది. నా కెరీర్ లో విభిన్న చిత్రమవుతుంది” అని అన్నారు.హీరోయిన్ అపర్ణాదేవి మాట్లాడుతూ, కెరీర్ తొలి దశలోనే ఇలాంటి మంచి చిత్రంలో, నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

Also Read:Bhumana:క్రీడాస్ఫూర్తితో ప‌నిచేయాలి

- Advertisement -