జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370తో పాటు 35ఏను రద్దు చేస్తూ మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా పలు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి తాము తీసుకున్న నిర్ణయం గురించి వివరించారు. దీనికి పలువురు సీఎంలు మద్దతు తెలిపారు.
ఇక మరోవైపు హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉండటంతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సజ్జనార్ తెలిపారు.