టీ-డయాగ్నోస్టిక్స్‌లో 134 టెస్టులు

76
- Advertisement -

రాష్ట్రంలో టీ-డయాగ్నోస్టిక్స్‌ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటివరకు టీ-డయాగ్నోస్టిక్స్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా 57 రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టెస్టుల సంఖ్యను 134కు పెంచారు. దీంతోపాటు కొత్తగా 8 జిల్లాల్లో పాథాలజీ ల్యాబులు, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబులు సిద్ధమయ్యాయి. వీటిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని జిల్లా దవాఖాన నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రైవేట్‌ ల్యాబుల్లో రూ.500 నుంచి రూ.10వేల వరకు ఖరీదు చేసే పరీక్షలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానపై నమ్మకంతో వచ్చే రోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కావొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ టీ-డయాగ్నోస్టిక్స్‌కు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 2018 జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పీహెచ్‌సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానల్లో ఉచిత పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 57 రకాల పాథాలజీ (రక్త, మూత్ర) పరీక్షలతోపాటు, ఎక్స్‌రే, యూసీజీ, ఈసీజీ, 2డీ ఈకో, మామోగ్రామ్‌ వంటి రేడియాలజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.

టీ డయాగ్నోస్టిక్స్‌ వల్ల రోగులకు అనేక ప్రయోజనాలు కలిగాయి. పేదలకు వ్యాధి నిర్ధారణ పరీక్షల భారం పూర్తిగా తప్పింది. 24 గంటల్లోపే పరీక్ష ఫలితాలు వస్తుండటంతో వైద్య సేవల్లో ఆలస్యం తగ్గింది. ఖర్చులకు భయపడి పరీక్షలు చేయించకపోవడంతో వ్యాధి ముదిరి ప్రాణాంతకంగా మారేది. ఇప్పుడు వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం దక్కింది. జీవనకాలం పెరిగింది. ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుండటంతో వైద్యులకు చికిత్స అందించచడం సులభం అయ్యింది.

Also Read:పాక్ క్రికెటర్ ఆఫ్రిది సరికొత్త రికార్డు..

హైదరాబాద్‌లో సెంట్రల్‌ ల్యాబ్‌తోపాటు 15 స్పోక్స్‌తో టీడీ సేవలు ప్రారంభం కాగా.. ఇప్పుడు సెంట్రల్‌ ల్యాబ్‌తోపాటు 19 మినీ హబ్‌లు, 435 స్పోక్స్‌కు విస్తరించింది. మరో 19 జిల్లా కేంద్రాల్లో హబ్‌లు ఉన్నాయి. మిగతా 13 జిల్లాల్లో హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గతేడాది అనుమతి ఇచ్చింది. వీటిలో 8 హబ్‌ల పనులు పూర్తయ్యాయి. రంగారెడ్డి (కొండాపూర్‌), సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌ (నర్సంపేట), యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ల్యాబ్‌లో నాణ్యత ప్రమాణాలు అత్యుత్తమంగా పాటిస్తున్నారంటూ ఇప్పటికే ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ వచ్చింది. 13 జిల్లా ల్యాబులు ఎన్‌ఏబీఎల్‌ ప్రాథమిక అక్రిడిటేషన్‌ సాధించాయి. మరో ఆరు ల్యాబుల తనిఖీ కొనసాగుతున్నది. ఇప్పటివరకు టీ డయాగ్నోస్టిక్స్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించారు. 57.68 లక్షల మంది రోగులు ప్రయోజనం పొందారు.

రేడియాలజీ పరీక్షలు మరింత నాణ్యంగా, వేగంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రేడియాలజీ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 32 రేడియాలజీ హబ్‌ల ఏర్పాటుకు గతేడాది అనుమతి ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు 13 హబ్‌ల పనులు పూర్తయ్యాయి. హన్మకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ (నర్సంపేట), వనపర్తి, రంగారెడ్డి, పెద్దపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి (హైదరాబాద్‌), నారాయణపేట జిల్లాల్లో రేడియాలజీ హబ్‌లు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Also Read:బీజేపీ లోగోను తొలగించిన ఈటల

ఒక్కో రేడియాలజీ, పాథాలజీ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4.39 కోట్లు ఖర్చు చేస్తున్నది. 134 పరీక్షలు నిర్వహించేందుకు మరో రూ.1.70 కోట్లు వెచ్చిస్తున్నది. అంటే ఒక్కో హబ్‌ ఏర్పాటుకు రూ.6.09 కోట్ల వ్యయం కానున్నది. గతంలో ల్యాబుల నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు కాగా.. ఇప్పుడు అదనంగా మరో రూ.60 లక్షల భారం పడనున్నది. మొత్తంగా ప్రభుత్వం ఏటా రూ.3 కోట్లు వెచ్చించనుంది.

- Advertisement -