యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. యంగ్ టైగర్ దాహాన్ని తీరుస్తు కేవలం 18 రోజుల్లోనే రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించి రూ. 150 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
సినిమా విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. ఓవర్సీస్లో 16 రోజుల్లోనే 1.76 మిలియన్ డాలర్లు సంపాదించిన ఈ చిత్రం నాన్నకు ప్రేమతో రికార్డును బద్దలు కొట్టే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పట్లో తెలుగులో పెద్ద సినిమాలేవీ విడుదలయ్యే అవకాశం లేకపోవడం ఎన్టీఆర్‌కు బాగా కలిసొచ్చింది. ఒక్క నైజాంలోనే ఇంతరవకూ 17 కోట్ల షేర్‌ను రాబట్టడం విశేషం. దర్శకుడికిది హ్యాట్రిక్ విజయం.
జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ సహా చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది. తెలుగుతోపాటు, దక్షిణాదిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రాజమౌళి తెరకెక్కించిన బహుబలి రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత వేగంగా వంద కోట్లు వసూలు చేసింది జనతా గ్యారేజ్. దక్షిణాది నుంచి 23 సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరగా, అందులో 9 మాత్రమే తెలుగు సినిమాలు కావడం గమనార్హం.