మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఉందా? తరచూ కార్డుతో లావాదేవీలు జరుపుతుంటారా? పెట్రోల్ బంకుకు వెళ్లినా, షాపింగ్‌మాల్‌కు వెళ్లినా, ఆన్‌లైన్ షాపింగ్ అయినా కార్డు వాడేస్తున్నారా? అయితే మీ కార్డును సేఫ్‌గా ఉంచడానికి కొన్ని టిప్స్ పాటించండి. ఎందుకంటే ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కార్డు మీ జేబులోనే ఉన్నా… మీ అకౌంట్‌లో డబ్బులు కొట్టేసే కేటుగాళ్లున్నారు.
అందుకే కార్డు వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మోసపోయిన తర్వాత బాధపడటం, ఫిర్యాదులు చేయడం కన్నా ముందే అప్రమత్తంగా ఉంటే మోసాలను అడ్డుకోవచ్చు. కార్డు లావాదేవీల విషయంలో తీసుకోవాల్సిన 12 జాగ్రత్తల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వివరించింది. మరి ఆ 12 గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకోండి. పాటించండి.
1. కార్డు తీసుకోగానే వెనకవైపు సంతకం చేయండి.
2. ఏటీఎం పిన్ తరచూ మారుస్తూ ఉండండి.
3. కార్డుపైన పిన్ నెంబర్ రాయకూడదు. గుర్తుంచుకోవాలి.
4. మీ కార్డు ఎవరికీ ఇవ్వొద్దు. పిన్ నెంబర్ చెప్పొద్దు. బ్యాంక్ అధికారులు, కస్టమర్ కేర్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు కూడా కార్డు ఇవ్వొద్దు. ఏ బ్యాంకు కూడా ఇలాంటి సమాచారం అడగదు.
5. మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేప్పుడు ఇతరులను లోపలికి రానివ్వకూడదు. డబ్బులు డ్రా చేసేందుకు ఎవరి సాయం తీసుకోవద్దు.
6. ఏటీఎం, పీఓఎస్ మెషీన్‌లో పిన్ ఎంటర్ చేసేప్పుడు చేతిని అడ్డుగా పెట్టాలి.
7. ట్రాన్సాక్షన్ స్లిప్‌ను ఏటీఎం గదిలో పారేయకండి. అందులో మీ అకౌంట్ సమాచారం ఉంటుంది.
8. ఏటీఎం స్క్రీన్ సాధారణ మోడ్ వచ్చేవరకు వెయిట్ చేయండి. గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుందో లేదో చూడండి.
9. హోటళ్లు, షాపులు, మాల్స్‌లో మీ ముందే కార్డు స్వైప్ చేయమని కోరండి.
10. టెంపరరీ స్టాల్స్‌లో మీ కార్డు స్వైప్ చేయకూడదు.
11. కొత్త కార్డు తీసుకోగానే పాత కార్డును ముక్కలుముక్కలుగా కట్ చేయండి.
12. ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం మీ మొబైల్ నెంబర్‌ను బ్యాంకులో రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ 12 గోల్డెన్ రూల్స్ గుర్తుంచుకుంటే మీ కార్డు ట్రాన్సాక్షన్స్ చాలావరకు సేఫ్. ఏ బ్యాంకు కార్డులకైనా ఇవే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీకు సంబంధం లేకుండా ఏవైనా లావాదేవీలు జరిగినా, మోసపోయినట్టు అనుమానం వచ్చినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేయండి.