కొత్త అల్లుడికి అత్తారింటి ఆతిథ్యం ఎలా ఉండాలో చూపించారు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన కోనా హనుమాన్ బాబు కుటుంబం. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కోనా హనుమాన్ బాబు, కళ్యాణి దంపతుల కుమార్తె శ్రీజను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నారాయణం సంజయ్‌కు వివాహం చేసి ఘనంగా అత్తారింటికి ఆహ్వానించారు.
పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడు సంజయ్ అత్తారింటికి రావడంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంప్రదాయం, ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచేలా ఏకంగా 1,116 రకాల వంటకాలతో ఘన విందు ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు సంప్రదాయ వంటకాలతో పాటు ఉత్తర భారత, దక్షిణ భారత, మిఠాయిలు, పిండివంటలు, నైవేద్యాలు, పానీయాలు ఇలా ఎన్నో రకాల వంటకాలు వడ్డించారు.
ఈ విందు ఏర్పాట్లలో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కూడా పాలుపంచుకున్నారు. కొత్త అల్లుడిని గౌరవించడం, కుటుంబ విలువలను చాటడం ఈ విందు ప్రధాన ఉద్దేశమని కోనా హనుమాన్ బాబు తెలిపారు. 1,116 వంటకాల విందు వార్త స్థానికంగా సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయం, ఆతిథ్యానికి అద్దం పట్టే ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read:పొట్ట చుట్టు..కొవ్వు ఎందుకు పెరుగుతుంది?
