11 ఏళ్లకే ఇంటర్ ఉత్తీర్ణుడై తెలంగాణ విద్యార్థి అగస్త్య జైస్వాల్ రికార్డు సృష్టించాడు. రాష్ట్రంలో ఇంత తక్కువ వయస్సులో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థిగా చరిత్రకెక్కిన జైస్వాల్.. 63 శాతం మార్కులు సాధించాడు. హైదరాబాద్‌లోని కాచిగూడ, కుత్బిగూడ ప్రాంతానికి చెందిన అగస్త్యజైస్వాల్ ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో 634 మార్కులు దక్కించుకున్నాడు.
2015లో పదోతరగతి పరీక్షలు రాసి అతిచిన్న వయసులో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి విద్యార్థిగా రికార్డులకెక్కాడు అగస్త్య. 11 ఏండ్ల వయస్సులోనే ఆగస్త్య జైస్వాల్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం సీఈసీ పరీక్షలు రాసి ప్రథమ శేణిలో పాస్ అయ్యాడు.
ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆగస్త్య జైస్వాల్ తెలిపాడు. తల్లి, దండ్రులు అశ్విన్‌కుమార్ జైస్వాల్, భాగ్యలక్ష్మి జైస్వాల్‌ల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణతో ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్ పూర్తికావడంతో డిగ్రీలో మాస్ కమ్యూనికేషన్‌లో చేరుతానని తెలిపారు. తనకు తన అక్క సహకారం ఎంతో ఉందన్నాడు.
ఆగస్త్యజైస్వాల్ కు పూర్తి స్థాయిలో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. కంప్యూటర్ కీ బోర్డుపై రెండు సెకన్లలలో ఏ టూ జెడ్ అక్షరాలు టైప్ చేయగలడు. ప్రతి రోజూ ఉదయం 30 నిమిషాల పాటు యోగా చేస్తాడు. పౌరాణిక పద్యాలంటే ఇష్టం. భగవద్గీత శ్లోకాలు చెప్పగలడు.
గతంలో ఆగస్త్యజైస్వాల్ అక్క నైనా జైస్వాల్ 15 ఏండ్లకే పీజీ పరీక్షలు రాసి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులను సైతం నైనా సొంతం చేసుకున్నారు. తండ్రి అశ్విన్‌కుమార్, తల్లి భాగ్యలక్ష్మి ప్రోత్సాహం ఉండటంతో అక్కాతమ్ముడు అన్ని రంగాల్లో రాణిస్తు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.