నేటి నుంచే పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 6 వరకు పరీక్షలు జరగనుండగా ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 5 లక్షల 34 వేల 903 మంది విద్యార్ధులు హాజరవుతన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.
కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల దగ్గర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు దగ్గు, జలుబు ఉన్నట్లయితే ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్ధుల కోసం శానిటైజర్లు, లిక్విడ్ సబ్బులను అందుబాటులో ఉంచారు. ఇక విద్యార్థులు మాస్కులు ధరించినా, వాటర్ బాటిళ్లు తీసుకొచ్చినా పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వీరిలో బాలురు 2 లక్షల 73 వేల 971 మంది కాగా.. బాలికలు 2 లక్షల 60 వేల 932 మంది. ఇక 25 వేల 824 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎండతీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్య సిబ్బందితో పాటు… అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నారు.