రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నగరంలో ఉదయం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పొద్దున్నే వర్షం రావడంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మందగొడిగా సాగుతోంది. ఈసీఎల్, ఉప్పల్, ఎల్ బీ నగర్, కోటి, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, నాంపల్లి, బషీరాబాగ్, మారేడుపల్లి, బేగంపేట, బోయిన్‌పల్లి, ఆల్వాల్, పార్శిగూడ, చిలకలగూడ, అడ్డగుట్ట, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది.
మేఘాలు దట్టంగా అలముకోవడంతో రాత్రిని తలపిస్తోంది. నగరమంతా చీకటి వాతావరణం కమ్ముకుంది. దీంతో వీధి దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. ఉదయం 10 గంటలు దాటినా వెలుగు రాలేదు. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో వర్షం మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
అటు రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు కాలనీలు నీట ముగిగాయి. పరిగి, ఇబ్రహీంపట్నం, తాండూరు, వికారాబాద్ లో రహదార్లు జలమయం అయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
నల్లగొండ జిల్లాలోని వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల మండలాలు అదేవిధంగా మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, దుబ్బాక, సదాశివపేట, సిద్దిపేట, గజ్వేల్ మండలాల్లో వర్షం భారీగా కురుస్తుంది. కాగా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నంలో ఓ మోస్తరు వర్షం పడుతుంది.
మరో రెండు రోజులు వర్షాలు ….
మరో రెండు రోజులు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని దీని కారణంగా నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్ర డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. రుతుపవనాల కారణంగా తెలంగాణ తో పాటు.. కోస్తా, రాయల సీమలలో సైతం వర్షాలు పడే అవకావం ఉందన్నారు.