ఈ రోజు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలోని కరోనా లాక్‌డౌన్ పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,132కు చేరిందన్నారు. కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదని ఈటెల అన్నారు. కరోనా నుంచి శుక్రవారం 34 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు 727 మంది కోలుకున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే కొత్తగా పాజిటివ్ కేసులు వస్తున్నాయని మంత్రి తెలిపారు.
లాక్‌డౌన్‌ను కేంద్రం ఈనెల 17 వరకు పొడగిచిన.. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ మే 29 వరకు పొడిగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. కేంద్రం నిబంధనల ప్రకారం మరో 14 జిల్లాల్లో కరోనా లేదు. అందుకే మరో 14 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరాము అన్నారు.దీనిపై సోమవారం కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కరోనా రాకుండా ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని.. లాక్‌డౌన్‌ను అందరూ పాటించాలని మంత్రి కోరారు.