ఆమె వెండితెర అల్లరిపిల్ల. తను నవ్వితే పువ్వు పూస్తుంది. ఎన్నెన్నో అందాలూ, ఏవేవో రాగాలు అంటూ యువతరాన్నే కాక అందం, అభినయం తో అందరినీ అలరించింది ఈ చేప కనుల మీనా. ఇవాళ మీనా పుట్టిన రోజు.
బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన మీనా అటుపై హీరోయిన్ గా ఎదగటమే కాకుండా దక్షిణాది స్టార్ హీరోల సరసన నటించే అరుదైన అవకాశాన్ని పొందింది. ఆర్ దొరైరాజ్, రాజ్ మల్లిక దంపతులకు 1979 సెపెంబరు 16న జన్మించిన మీనా బాలనటిగా తెలుగు సినిమాలతో తన కెరీర్ ను ప్రారంభించింది. అదే సమయంలో తమిళంలో కూడా బాలనటిగా చేసింది.
తెలుగులో పలు సినిమాల్లో చేసినప్పటికీ ‘సిరివెన్నెల’ సినిమా ఆమెకు బాలనటిగా ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కొంత విరామం తర్వాత ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇందులో ఆమె నటన సీనియర్ నటుడు నాగేశ్వరరావు గారి నటనకు ధీటుగా వుంటుంది. ఆ తర్వాత వెంకటేష్ సరసన నటించిన ‘చంటి’ చిత్రం సూపర్ హిట్ గా నిలవడంతో మీనా కెరీర్ ఒక్కసారిగా ఊపందుకొంది.
అటుపై దక్షిణాదిన అందరి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలో నటించిన మీనా నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
అగ్ర కథానాయకులంతా ఆమెకి ప్రాధాన్యమివ్వడంతో, ఆమె డేట్స్ కోసం నిర్మాతలంతా పోటీ పడ్డారు. ఫలితంగా అగ్ర హీరోలందరి సరసన ఆమెకి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అలా ఆమె కెరియరులో ‘అల్లరి మొగుడు’ … ‘సుందర కాండ’ … ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ …’బొబ్బిలి వంశం’ … ‘ముఠామేస్త్రి’ వంటి ఘన విజయాలు వచ్చి చేరాయి. విశాలమైన కళ్ళు … ముసిముసి నవ్వులు మీనా ప్రత్యేకత. ఎలాంటి హావభావాలనైనా ఆమె చాలా తేలికగా పలికేసేది. తెలుగులో మాదిరిగానే ఆమె తమిళంలో సైతం అగ్రకథానాయకులతో నటించి,అక్కడ కూడా తన హవాను కొనసాగించింది.
1993 వరకూ తెలుగులో అగ్రతారగా వెలిగిన మీనాకు అటుపైన చెప్పుకోదగ్గ విజయాలు లభించకపోవడంతో, తమిళంలో మంచి అవకాశాలు లభించడంతో తెలుగులో రెగ్యులర్ చిత్రాలు తగ్గించింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో చిర౦జీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, ముమ్ముట్టి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, హర్షవర్ధన్, సత్యరాజ్, విజయ్, అజిత్, రవితేజ వంటి అగ్ర హీరోల౦దరి సరసన నటించింది.
2009 లో విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని పెళ్లి చేసుకుని ఒక కూతురికి తల్లి అయిన మీనా పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకుని మరల నటిస్తుంది. పరిశ్రమ లో రోజా, శ్రీదేవి, మహేశ్వరీ, సంఘవి తన స్నేహితులని చెపుతుంది మీనా.
మొత్తం నాలుగు భాషల్లో కలిపి రెండు వందలు సినిమాలు చేసిన మీనా జన్మదినం సందర్భంగా ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకుని మీనా మరిన్ని సినిమాలు చేయాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ.కామ్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.