రివ్యూ:నిర్మలా కాన్వెంట్

445
nirmala convent
- Advertisement -

శ్రీకాంత్ కొడుకు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ అక్కినేని నాగార్జున తెరకెక్కించిన టీనేజ్ లవ్‌స్టోరీ ‘నిర్మలా కాన్వెంట్’. ట్రైలర్, పాటలతో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ.. సినిమా ఎలా ఉంది? కొత్తతరం చేసిన ఈ ప్రయత్నం ఆకట్టుకొనే రీతిలో సాగిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
శామ్యుల్‌(రోషన్).. ఒక పేద కుటుంబానికి చెందినవాడు. చదువులో చురుకైన వాడు. తన క్లాస్ మేట్.. రాజ వంశ కుటుంబీకుడైన భూపతి రాజు ఏకైక కూతురు శాంతి (శ్రేయా శర్మ)తో ప్రేమలో పడతాడు శామ్యుల్‌. ఇద్దరు నిర్మలా కాన్వెంట్ అనే స్కూల్లో 11వ తరగతి చదువుతూంటారు. ఇద్దరు టీనేజర్లు కాబట్టి అంత బాగానే వెళ్తుంది. తమ పూర్వీకుల గొడవలు వీరి ప్రేమకు అడ్డుగా మారుతాయి. మరో అవకాశం లేని శామ్యుల్‌.. నేరుగా శాంతి ఇంటికెళ్లి.. శాంతిని తనకిచ్చి పెళ్లి చేయమని శాంతి తల్లితండ్రులను అడుగుతాడు. అయితే వీరి ప్రేమను భూపతి రాజు తిరస్కరించడమే కాక ఇద్దరినీ దూరం చేసేస్తాడు. ఆ తర్వాత సామ్ తన ప్రేమను దక్కించుకోవడానికి ఏం చేశాడు? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అన్నింటికంటే ప్లస్ పాయింట్ రోషన్‌.. శ్రియల జంట. రోషన్‌కి ఇదే తొలి సినిమా అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకొన్నాడు. శ్రియ ఎక్స్ ప్రెషన్స్ ముద్దుముద్దుగా ఉన్నాయి. కింగ్ నాగార్జున సెకండాఫ్‌లో ఉన్నంతసేపూ తన ఈజ్‌తో సినిమాను నడిపించాడు. రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే పూర్తి స్థాయిలో మెప్పించాడు. కథలో చిన్న చిన్న సన్నివేశాలను, పాత్రలను పరిచయం చేసి చివర్లో వాటన్నింటినీ వాడుకోవడం బాగా ఆకట్టుకుంది. ఇక.. ఎల్బీ శ్రీరాం కనిపించింది కాసేపే అయినా అందులో ఆయన నటన.. సంభాషణలు బాగున్నాయి. నాగార్జున, రోషన్‌ల మధ్యన వచ్చే సన్నివేశాలన్నీ బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :
కథ ముందే ఊహించగలిగేలా ఉండడం ఈ సినిమాకు మైనస్ పాయింట్‌. అయితే దర్శకుడు తనదైన ట్రీట్‌మెంట్‌తో కొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసి ఉండాల్సింది. కానీ.. దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు. ప్రధమార్థం కొత్తగా అనిపించదు. శామ్యూల్‌ తన తెలివితేటల్ని ప్రదర్శించే సన్నివేశాలు మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే బాగుండేది. బీ పాజిటీవ్‌ రక్తాన్ని ఓ నెగిటీవ్‌గా మార్చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. కథానాయిక తండ్రి విసిరిన ఛాలెంజ్‌ కోసం కోట్లు సంపాదించడానికి ఓ పదహారేళ్ల కుర్రాడు సిటీకి బయల్దేరటం.. దాన్ని సాధించడం సినిమాటిక్‌గా అనిపిస్తాయి. తొలి భాగంలో స్నేహితుల మధ్య కొన్ని సరదా సన్నివేశాలు రాసుకోవాల్సింది. సెకండాఫ్‌లో గేమ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో కొత్తదనం తీసుకొచ్చినా, ఆ గేమ్ షో ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ సినిమా నుంచి ప్రేరణగా పొంది రాసుకున్నవిగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రేమకథ కొన్నిచోట్ల సాగదీసినట్లు అనిపించింది.

Nirmala-Convent-Movie

సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు నాగ కోటేశ్వరావు గురించి చెప్పుకుంటే.. తన మొదటి సినిమాకు ఒక క్యూట్ లవ్‌స్టోరీనే చెప్పాలన్న ప్రయత్నంలో ఆయన విజయం సాధించాడు. అయితే కథను ఎంపిక చేసుకోవటంలో తడబాడ్డాడని అనిపిస్తుంది. ఇక హీరో రోషన్‌ను పూర్తి స్థాయి పాత్రలో పరిచయం చేసే క్రమంలో దర్శకుడి ప్రతిభను గమనించొచ్చు.

రోషన్ సాలూరి స్వరపరచిన బాణీలు బాగున్నాయి. కొత్త కొత్త భాష పాట ఆకట్టుకొంటుంది. పాటలన్నీ వినడానికి బాగుండడంతో పాటు విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఇంకా బాగా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రాఫర్ విశ్వేశ్వర్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి కూడా బాగున్నాయి.

తీర్పు :
శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి ఈ సినిమా పర్‌ఫెక్ట్‌ లాంచింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు అన్నివిధాలా అట్రాక్టింగ్ పాయింట్ అంటే హీరో రోషన్ అనే చెప్పాలి. తన ఇన్నోసెంట్ నటనతో ఆకట్టుకున్నాడు. మంచి ఈజ్‌తో రోషన్, శ్రేయా ప్రదర్శించిన నటన, నాగార్జున స్పెషల్ రోల్ లాంటివి ఈ ప్రేమకథకు బాగా కలిసి వచ్చే అంశాలు. ఒక్క ఫస్టాఫ్‌లో సినిమా సాగదీసినట్లు ఉండడాన్ని పక్కనబెడితే నిర్మలా కాన్వెంట్‌ బాగా ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ’నిర్మలా కాన్వెంట్‍’ ఓ టీనేజ్ ప్రేమకథ..!!

విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2016
రేటింగ్ : 3/5
నటీనటులు : రోషన్, శ్రేయా శర్మ, నాగార్జున
నిర్మాత : నాగార్జున – నిమ్మగడ్డ ప్రసాద్
సంగీతం : శ్రీ కళ్యాణ్ రమణ
దర్శకత్వం :జి. నాగ కోటేశ్వరరావు

- Advertisement -