గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. సహ్యాద్రి గెస్ట్ హౌజ్లో జరిగిన ఒప్పందంపై ఇరు రాష్ట్రా సీఎంలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీటి పారుదల రంగంలో ఇరు రాష్ర్టాల మధ్య చారిత్రక ఒప్పందం జరిగిందన్నారు. ఈ ఒప్పందంపై సంతకాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవి అని పేర్కొన్నారు. మహారాష్ట్రతో తామేప్పుడూ సఖ్యతగానే ఉంటామని స్పష్టం చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాల నడుమ సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను తెలంగాణ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.
అంతరాష్ట్ర ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సార్లు చర్చలు జరిగాయని, ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పట్టించుకోలేదని, కేంద్రం, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెలిపారు. ఇరు రాష్ట్రాల నడుమ ఒప్పందం దేశానికే ఆదర్శమని చెప్పారు. తుమ్మిడిహట్టితో మహారాష్ర్టకు జరిగే నష్టాన్ని నివారించేందుకు మేడిగడ్డ వద్ద బ్యారేజీ ప్రతిపాదించామని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నీటిని ఆదిలాబాద్ జిల్లాకు మాత్రమే ఉపయోగిస్తామన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయమేంటో దేశమంతా తెలుసన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే నినాదాలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో మహారాష్ర్టకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ర్టాలు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఒప్పందంతో ఇరు రాష్ర్టాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ర్టాల మధ్య సమన్వయం అవసరమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆచరణాత్మకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో తెలంగాణ మంత్రి హరీష్రావు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు.