సింహాలకూ వివాహ విందు… భలే పసందు

247
Bangladesh zoo throws wedding for lions with meat cake
Bangladesh zoo throws wedding for lions with meat cake
- Advertisement -

చుక్కలాంటి అమ్మాయికి చక్కనైన అబ్బాయితో పెళ్లి చేశారు. ఆ పెళ్లి అలా ఇలా జరగలేదు. ఊరందరినీ పిలిచి.. పెద్ద పండగలా చేశారు. రంగురంగుల ముగ్గులతో అలంకరించి.. బెలూన్లు కట్టి.. రిబ్బన్లు చుట్టి అందంగా డెకరేట్ చేశారు. ఇదంతా ఓ రెండు సింహాల పెళ్లి వైభోగం. చాలా కాలంగా ఒంటిరిగా ఉంటున్న ఓ సింహాన్ని.. మరో సింహానికి జత చేశారు. ఓ అయ్య చేతిలో పెట్టి… సొంత కూతురికి పెళ్లి చేస్తే ఎలా సంబరపడతారో అలా మురిసిపోయారు ఆ జూ సిబ్బంది.

 Chittagong zoo

‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు ఓ హో హో’.. అచ్చం ఇలాంటి విందును బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జంతుప్రదర్శనశాలలో సింహాలకు ఏర్పాటు చేసి పర్యాటకులను అబ్బురిచారు జూ అధికారులు.

ఈ వివరాలను పరిశీలిస్తే… బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జూపార్కులో నోవా అనే ఆడ సింహం 11 ఏళ్లుగా ఒంటరిగానే జీవిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఆడసింహం ఒంటరితనాన్ని చూడలేక అధికారులు దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలోని రంగాపూర్ జూ నుంచి నభా పేరుతో ఉన్న మరో మగ సింహాన్ని చిట్టగాంగ్ జూకు అధికారులు రప్పించారు. దీనికి బాద్షా అనే పేరు పెట్టారు. కొత్తగా సింహం వచ్చిన వేళ… ఇద్దరికి పెళ్లి జరుగనున్న వేళ జూ అధికారులు ఆ బోనును పెళ్లి మండపంలా అలంకరించారు.

 Chittagong zoo

రంగురంగుల కాగితాలు, బెలూన్ల‌తో సింహాల ఎన్‌క్లోజర్‌ను ముస్తాబు చేసి 400 మంది అతిధుల మధ్య సింహాల వివాహ విందును ఘనంగా ఏర్పాటుచేశారు. ఆ రెండు సింహాలు విందు ఆరగించడం కోసం పదికిలోల కేక్‌ను తయారు చేసి పెట్టారు. గొడ్డుమాంసంతోపాటు చికెన్, గుడ్లు, వేయించిన కాలేయం కలిపి ప్రేమ చిహ్నం లవ్ ఆకారంలో చేసిన కేక్‌ను పెట్టడంతో ఆ నూతన వధూవరులైన సింహాలు సంతోషంతో విందును ఆరగించాయి.

కొత్తగా పెళ్లాడిన ఈ సింహాలు ఒకరి గురించి మరొకరికి అవగాహన ఏర్పడేలా చేసేందుకు మూడు రోజుల పాటు పక్కపక్కన ఏర్పాటు చేసిన బోన్లలో ఉంచినట్లు జూ క్యూరేటర్ మోర్షాద్ వివరించారు. ఎంతైనా సింహాల పెళ్లి… విందు భలే పసందుగా ఉంది కదా.

- Advertisement -