దక్షిణ ఆయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ నెల 26 న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక,గోడ పత్రికను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో ఆవిష్కరించారు. మిథిల ప్రాంగంణంలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు.
కళ్యాణ శోభ ఉట్టిపడేలా మండపాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. స్వామి వారి కళ్యాణానికి అందరు అహ్వానితులేనని ఆహ్వానం పలికారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సతీసమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా,కర్నాటక నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వారి కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల భక్తుల కోసం హిందీ భాషలో కూడా గోడ పత్రికను ముద్రించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఆలయ ఈవో ప్రభాకర శ్రీనివాస శర్మ, ఖమ్మం డిసిసిబి చైర్మన్ మువ్వ విజయబాబు పాల్గోన్నారు.
యాదాద్రి తరహాలోనే భద్రాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చేపడతామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, త్రిదండి శ్రీ చినజీయర్ స్వామితో సంప్రదించి ఆలయ అభివృద్ది పనుల ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెల 27న శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం రోజున సీయం కేసీఆర్ సమయానుకూలతను బట్టి ఆయన చేతుల మీదుగా ఆలయ అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆలయ అభివృద్ది పనులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.100 కోట్లను మంజూరు చేశారని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తారన్నారు.