వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చాలి- మంత్రి కేటీఆర్‌

133
minister ktr
- Advertisement -

తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయంలో వ్యవసాయ శాఖ పని తీరు అభినందనీయం అన్నారు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌. ఈరోజు ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యవసాయరంగంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంక్షోభం నుండి సంవృద్ది వైపు వెళ్లుతున్నామన్నారు.

తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయంలో వ్యవసాయ శాఖ పని తీరు అభినందనీయం అన్నారు. తెలంగాణలో నాలుగు రకాల విప్లవాలు మొదలయ్యాయి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రెండో హరిత విప్లవం మొదలయింది. మత్స్య పరిశ్రమలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్ విప్లవం, పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం మొదలయింది అని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇల్లంతకుంట ప్రాంతం ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామా .. నేడు అక్కడ లక్ష టన్నుల దిగుబడి పెరిగింది. రాష్ట్రం శక్తిని మార్చే సత్తా వ్యవసాయరంగానికి ఉంది. రెండు కోట్ల పైచిలుకు జనాభా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యవసాయరంగం నుండి ఉపాధి పొందుతున్నారు.

రైతు అంటే చిన్నచూపు పోయింది.. వ్యవసాయరంగాన్ని లాభసాటి రంగంగా మార్చాలి. వ్యవసాయం పరిశ్రమగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను బలోపేతం చేయాలి. మంత్రి వర్గ ఉపసంఘం ప్రొఫెసర్ స్వామినాథన్ , జయతీ ఘోష్ , పాలగుమ్మి సాయినాథ్, సుభాష్ పాలేకర్ గార్లను సంప్రదించాలి. అమెరికాలోని అయోవాలో ఉన్న అగ్రికల్చర్ మ్యూజియంను అధికారుల బృందం సందర్శించాలని కేటీఆర్‌ సూచించారు. 32 జిల్లాలలో 50 నుండి 100 ఎకరాలలో డెమానిస్ట్రేట్ ఫార్మ్ లు ఏర్పాటుకు యోచిద్దాం. వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా నవీన ఆవిష్కరణలు రావాలి. రైతులను తక్కువ అంచనా వేయకూడదు.. చదువురాని వారు కూడా స్మార్ట్ ఫోన్ల రాకతో ఎంతో అవగాహన పెంచుకున్నారు.

వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలి. రైతులకు ట్యాబ్లెట్ లు అందించే అవకాశాలను పరిశీలించాలి. డ్రోన్లు, ఇతర వ్యవసాయ ఆవిష్కరణల వైపు యువతను ప్రోత్సహించాలి.గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్రాల వివరాలను ఉబరైజేషన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకోవాలి.వేరుశెనగ ఆధారిత ఉత్పత్తుల, టమాటా ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలి. అలాగే మిద్దె తోటలను ప్రోత్సహించాలన్నారు. మూడు శాతం జనాభా ఆధారపడ్డ అమెరికా వ్యవసాయ రంగం నుండి ఆ దేశ జీడీపీలో తొమ్మిది శాతం సంపదను సమకూరుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి,పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డిలు హాజరైయ్యారు.

- Advertisement -