ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలతో ప్రత్యర్థులను చీల్చి చెండాడుతుంటారు. మీడియా ద్వారా, మరోసారి ట్విట్టర్ లో… ఎక్కడ వీలుంటే అక్కడ మాటల తూటాలు పేలుస్తుంటారు. మోడీ ప్రసంగం డబ్ స్మాషైనా…చలోక్తులు విసరడంలోనైనా లాలూ స్టైలే వేరు. ఇప్పుడు తాజాగా అదేబాటలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేరారు. ఇటీవలె వరదలతో అతలాకుతలమైన బీహార్‌ను సందర్శించేందుకు వెళ్లిన లాలూ చేసిన వ్యాఖ్యలు వరద బాధితులను ఆయోమయానికి గురిచేశాయి. గంగ మీ ఇళ్లకు రావడం అదృష్టమంటూ వరద బాధితులను ఉద్దేశించి లాలు వ్యాఖ్యానించారు. ‘చాలా సందర్భాల్లో మీరే గంగానది దగ్గరకు వెళ్తారు. అలాంటిది గంగ మీ ఇళ్లకు రావడం మీ అదృష్టం. ఇది ఎప్పుడో కానీ జరగదు’ అంటూ తన స్టయిల్లో లాలు అన్నారు.
ఇప్పుడు తాజాగా బీహార్‌లో మద్యం పాన నిషేధం విధించిన తర్వాత నితీశ్ కూడా అదే స్టైల్లో స్పందించారు. మద్యపాన అలవాటు మానుకోలేకపోతున్న మందుబాబులకు ఉచిత సలహాలు ఇచ్చారు. లైట్లు ఆఫ్ చేసి జ్యూస్ తాగండి…మీకు మందు తాగిన ఫీలింగే కలుగుతుందని హితబోద చేశారు. పళ్ళ రసాలు అలవాటు చేసుకోవడం ద్వారా మద్యాన్ని మానేయవచ్చని…దీంతో మద్యం మహమ్మారికి దూరం కావచ్చాను. మద్యం తాగి జీవితాలను నాశనం చేసుకోవద్దని…మద్యపానం నిషేధించిన తర్వాత తనకు కలిగినంత ఆత్మసంతృప్తి మరెప్పుడు కలగలేదని నితీశ్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో తాను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. అన్నమాట ప్రకారం మద్యపానంపై నిషేధం విధించారు.తొలుత పాక్షికంగా మద్యంపై నిషేదం విధించిన నితీశ్… ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తిస్ధాయిలో నిషేదాన్ని అమల్లోకి తెచ్చారు. మద్యపాన నిషేధంపై బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో బీహార్ కు చెందిన ఎమ్మెల్యేలంతా మద్యానికి దూరంగా ఉంటామని వాగ్దానం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిని జైలుకు పంపించేలా చట్టం కూడా తెచ్చారు. కొందరు జేడీయూ నేతలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు నితీశ్. నిబంధనలు అతిక్రమించిన వారికి బెయిల్ కూడా రాకుండా చట్టంలో చేర్చారు.