సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు.. ఇటివలే అనంతపురం జిల్లా హిందుపురంలో ఎన్నికల ప్రచారంలో మీడియా ప్రతినిధి పట్ల బాలయ్య దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే… కాగా తాజాగా సొంత పార్టీ కార్యకర్తపైనే చిందులు తొక్కారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లిన బాలయ్యను.. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రవికుమార్ తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని కోరారు.
దీంతో ఆగ్రహానికి గురైన బాలయ్య.. రవికుమార్‌ను తోసేశారు. బయటకు పంపాలని పోలీసులను ఆదేశించగా..వారు అతన్ని అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్ వెంటనే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి.. సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్బాల్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటికే చాలా సార్లు బాలయ్య అభిమానుల మీద చెయ్యి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఈసారి టీడీపీ కార్యకర్తపై చెయ్యి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.