తెలుగు సినిమా ఓనమాలు నేర్చుకోక ముందే తెలంగాణ నుంచి ఓ వ్యక్తి బాలీవుడ్ లో మొనగాడిగా నిలిచాడు. టాకీలు రాకముందే మూకీ సినిమాల్లో నటించి దేశానికి తెలంగాణ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాడు. కరీంనగర్ లో పుట్టి నిజాం కాలేజీలో చదువుకుని.. బాలీవుడ్ లో గొప్ప నటుడుగా ఎదిగిన పైడి జయరాజ్ జయంతి ఇవాళ.
బాలీవుడ్లో మన ‘జయ’కేతనాన్ని ఎగురవేసిన తొలితరం నటుడు. భారతీయ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తెలుగుసినీప్రముఖుడు కూడా ఆయనే. కరీంనగర్ బిడ్డ అయిన పైడి జయరాజ్ చదువు సంధ్యలు సాగింది హైదరాబాద్లోనే.
నాటి హైదరాబాద్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో 1909 సెప్టెంబర్ 28న జయరాజ్ జన్మించారు. ఆయన చదువు సంధ్యలన్నీ హైదరాబాద్లోనే సాగాయి. నిజాం కాలేజీలో ఆయన డిగ్రీ చదువుకున్నారు. టాకీలు ఇంకా ప్రారంభం కాని ఆ కాలంలోనే ఆయనకు సినిమాలపై మక్కువ ఏర్పడి, 1929లో బాంబే చేరుకున్నారు.
మూకీ సినిమా ‘స్టార్ క్లింగ్ యూత్’ ఆయన తొలిచిత్రం. ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహా సాగర్ మోతీ’, ‘ఫ్లైట్ ఇన్టు డెత్’, ‘మై హీరో’ వంటి పదకొండు మూకీ సినిమాల్లో జయరాజ్ నటించారు. 1931లో ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో రూపొందించిన ‘షికారీ’ ఆయన తొలి టాకీ చిత్రం.
అక్కడి నుంచి జయరాజ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆనాటి నట దిగ్గజాలు పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్, మోతీలాల్ వంటి వారికి దీటుగా దాదాపు రెండు దశాబ్దాల పాటు యాక్షన్ హీరోగా బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగారు. నిరూపా రాయ్, శోభనా సమర్థ్, షకీలా, శశికళ, దేవికారాణి, మీనాకుమారి, చాంద్ ఉస్మానీ, జేబున్నీసా, ఖుర్షీద్ వంటి హీరోయిన్ల సరసన ఆయన నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
పైడి జయరాజ్ బొంబాయిలో అడుగుపెట్టే సమయానికే చాలా కాంపిటీషన్ ఉంది… సంపన్నకుటుంబాలకు మాత్రమే సినిమా అవకాశం దక్కేది..ఆరడుగుల ఎత్తు, ఆకట్టుకునే శరీర సౌష్టవం, ఉత్తర భారతీయులను తలదన్నే రూపంతో జయరాజ్ పది మందిలో ప్రత్యేకంగా కనిపించేవాడు..చిన్ననాటి ఫ్రెండ్ సహాయంతో మహావీర్ ఫిలిం కంపెనీ జగమతి జవానీ అనే మూకీ సినిమాలో జయరాజ్ నటించాడు. అప్పటికి జయరాజ్ వయసు 19 ఏళ్లే..ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
తెలంగాణాలో పుట్టడం, హైదరాబాద్ లో చదువుకోవడం కారణంగా ఉర్థూ, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం జయరాజ్ కు కలిసొచ్చింది..దీంతో పాటు నాటకాల్లో చిన్ననాటి నుంచే ప్రవేశం ఉండటంతో బాలీవుడ్ లో తొందరగా సెట్ అయ్యాడు. జగమతి జవానీ సినిమా తరువాత నిర్మాత ఇందులాల్ యాగ్ని హీరో అవకాశం ఇచ్చాడు. ప్రిజనర్ ఆఫ్ జెండా అనే ఇంగ్లీష్ నవలా ఆధారంగా తీసిన ఆ సినిమాలో జైరాజ్ పక్కన ఫేమస్ హీరోయిన్ మాధురి నటించింది.
ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇందూలాల్ వరసగా మరో నాలుగు సినిమాలకు హీరోగా జయరాజ్ ను సైన్ చేశాడు..ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో అగ్రహీరోలుగా వెలుగుతున్న పృద్వీరాజ్ కపూర్, శాంతారామ్, మోరియాల తో సమానంగా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు.
దక్షిణభారతదేశం నుంచి హిందీ సినిమాల్లో కనిపించిన మొదటి వ్యక్తి తెలంగాణ బిడ్డ పైడి జయరాజ్. తెలంగాణ చరిత్రను, అస్థిత్వాన్ని, ఇక్కడి మట్టి మనుషుల పోరాటాన్ని వాళ్లు సాధించిన ఘనవిజయాలను భావితరాలకు అందకుండా కుహానా చరిత్రకారులు చాలా కష్టపడ్డారు. అందుకే తెలంగాణా ఆణిముత్యం జయరాజ్ చరిత్ర పుస్తకంలో లేకుండా పోయారు.