హైదరాబాద్‌లోని చారిత్రాత్మక నూమాయిష్ ఎగ్జిబిషన్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపుగా కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లగా 200కి పైగా స్టాళ్లు అగ్నికి అహుతయ్యాయి. ప్రమాదంలో పదులసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అగ్నిప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ రాత్రి 11.20 గంటల సమయంలో సందర్శించారు. దగ్ధమైన స్టాళ్లను పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటామని, పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని చెప్పారు. భారీగా ఆస్తినష్టం జరిగినందున బాధితులకు సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అగ్నిప్రమాదంతో నుమాయిష్‌లో వేల సంఖ్యలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎగ్జిబిషన్‌లోని మహేశ్‌బ్యాంక్ స్టాల్లో చోటుచేసుకున్న విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ రాజుకున్న మంటలు క్రమంగా పక్కనే ఉన్న స్టాళ్లకు పాకాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మహేశ్‌బ్యాంకు స్టాల్లో షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం నష్టంపై అంచనా వేయాల్సి ఉందన్నారు.