రియో బ్యాడ్మింటన్లో షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. ఒలింపిక్ పతకం సాధించాలన్న భారత యువ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ఆశలు ఆవిరయ్యాయి. పోరాటపటిమ ప్రదర్శించినా చైనా అడ్డుగోడను దాటడంలో విఫలమయ్యాడు. క్వార్టర్ఫైనల్లో లిన్డాన్ చేతిలో 21-6, 11-21, 21-18 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి చవిచూశాడు.
చివరి పాయింట్ వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తొలి గేమ్లో ఓడిన శ్రీకాంత్ రెండో గేమ్లో దుమ్మురేపాడు. దూకుడు ఆటతో లిన్డాన్కు చుక్కలు చూపించాడు. మైండ్ గేమ్, స్మాష్లతో ఆకట్టుకున్నాడు. వీలైనప్పుడు భారీ షాట్లతోనూ చైనా ప్లేయర్కు గట్టి సవాల్ విసిరాడు. నువ్వానేనా అన్నట్టుగా సాగిన మూడో గేమ్లో ఇద్దరూ తమ సత్తాను చాటారు.
లిన్డాన్ స్టయిలిష్ ప్లే, శ్రీకాంత్ పట్టుదల మూడో గేమ్లో ప్రేక్షకులను థ్రిల్ చేసింది. బ్రేక్ టైమ్ తర్వాత మూడో సెట్ మరింత ఉత్కంఠంగా మారింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ తెగ కష్టపడ్డారు. ఆఖర్లో స్మాష్ షాట్లకు ప్రయత్నించిన శ్రీకాంత్ కీలకమైన పాయింట్లను కోల్పోయాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన లిన్డాన్ చివరకు శ్రీకాంత్ను ఓడించి సెమీస్లోకి ప్రవేశించాడు. దీంతో భారత అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. శ్రీకాంత్ పతకం వేటలో విఫలమైనా, తన ఆటతీరుతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు.