సినిమా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ లో బాలీవుడ్ లో సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు అమీర్ ఖాన్ కలిసి నటించేందుకు రంగం సిద్దమయ్యింది. 73 ఏళ్ల అమితాబ్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌లో నటించనున్నట్టు అమీర్ ఖాన్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు.
51 ఏళ్ల అమీర్ ఖాన్ తన ఐకాన్ అమితాబ్‌తో కలిసి నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఎన్నో ఏళ్లుగా నేను ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నా ఆరాధ్య నటుడు అమితాబ్‌తో పనిచేయడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. నా జీవితమంతా నేను ఆరాధించిన అమితాబ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యకు నా కృతజ్ఙతలు అంటూ ట్విట్టర్లో పేర్కోన్నాడు. అమితాబ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని ఆమిర్ ఖాన్ ఇంతకుముందు పేర్కొన్న సంగతి తెలిసిందే.
సినిమా టైటిల్ ’థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’.. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించనున్న ఈ సినిమాను ‘ధూమ్ 3’ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించనున్నాడు. హీరోయిన్లను ఇంకా ఎంపిక చేయలేదు. కాగా, 2018 దీపావళికి ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారని హిందీ సినిమా విమర్శకుడు, బిజినెస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. గతంలో షారుక్, సల్మాన్‌లతో బిగ్ బీ కలిసి నటించినా.. అమీర్‌తో నటించడం ఇదే తొలిసారి కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా రచయిత ఫిలిప్ మీడోస్ రచించిన పుస్తకం కాన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.