మైదానంలో తన బ్యాటింగ్ శైలి లాగానే.. సమకాలీన సంఘటనలకు తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ ఆకట్టుకుంటున్న భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత సైన్యంపై ట్వీట్ రూపంలో స్పందించాడు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రధాని మోడీ మొదలు పెట్టిన స్వచ్చ భారత్.. ఇపుడు పాకిస్తాన్‌లో కూడా మొదలు పెట్టారంటూ వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత సైన్యం అక్కడి ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేశారు.
దేశ సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రయిక్స్ తో భారత సైన్యం పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. ఇండియన్ ఆర్మీకి సెల్యూట్.. మనోళ్లు అద్భుతంగా ఆడారు. జైహింద్ అంటూ వీరూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ది మరిచిపోలేని ప్రస్థానం. విధ్వంసక ఆటతీరుకు నిలువెత్తు నిదర్శనంలా మారిన సెహ్వాగ్.. కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లని అందుకున్నాడు. 2004లో పాకిస్తాన్ తో ముల్తాన్ లో తొలిసారి ట్రిపుల్ సెంచరీ సాధించాడు వీరు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ మొత్తం ఆరు సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత 295 పరుగులు చేసేవరకు సెహ్వాగ్ మరోసిక్స్ కొట్టనే లేదు. సరిగ్గా ఆ సమయంలోనే సచిన్ వద్దకు వెళ్లి ‘‘ఒకవేళ సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్ వేస్తే మాత్రం సిక్సర్ కొడతా’’అని చెప్పాడట. చెప్పినట్లే సక్లయిన్ బౌలింగ్ వేయడం అతని బౌలింగ్‌తో సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించడం జరిగిపోయాయి.