ఫెడరేషన్ ఆఫ్ ఇండియన చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ (ఫిక్కీ ) హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డు-2016కు తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు ఎంపికయింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రత్యేకంగా రూపొందించిన జీపీఎస్ మొబైల్ యాప్‌ని అభినందిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. ఈనెల 31న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి నడ్డా అవార్డును అందజేస్తారు. ఈ యాప్ వరుసగా రెండు అవార్డులని గెలచుకోవడం విశేషం.
ఈ యాప్ అతి తక్కువ సమయంలోనే మంచి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. మూడు నెలల క్రితం ఏప్రిల్ 7, 2016 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ యాప్‌ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఈ యాప్ లక్ష డౌన్ లోడ్స్, 5 పాయింట్లకు 4.6 పాయింట్లను గూగుల్ ప్లే స్టోర్‌లో సాధించింది.
తెలంగాణ ఆరోగ్యశ్రీకి అవార్డు దక్కడం పట్ల వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.ఈ యాప్‌ని మరింత మెరుగు పరచి, సామాన్య ప్రజలకి వైద్య ఆరోగ్య సేవలని మరింత చేరువ చేస్తామని తెలిపారు.
తెలంగాణ ఆరోగ్యశ్రీ ప్రాజెక్ట్ మానిటరింగ్ వింగ్ జీపీఎస్ మొబైల్ యాప్‌ని తయారు చేసింది. ఈ యాప్ ద్వారా హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు, అత్యవసర చికిత్స అవసరమైన వాళ్ళు, ఇతరులు కూడా వైద్యం కోసం సంబంధిత రోగి ఉన్న చోటు నుండి 10కి.మీ. వైశాల్యంలో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ వివరాలు మ్యాప్ లో కనిపిస్తాయి. అలాగే రోగి ఉన్న చోటు నుంచి సమీప హాస్పిటల్‌కి రూట్ మ్యాప్ కూడా చూపిస్తుంది.
హాస్పిటల్స్‌కి సంబంధించిన ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడి, స్పెషాలిటీస్ కు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే వీలుంది. అలాగే అత్యవసర సమయాల్లో అందుబాటులో హెల్త్ కార్డు లేకున్నా, ఈ యాప్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులని డౌన్ లోడ్ చేసుకుని నేరుగా సేవలను పొందవచ్చు.
అత్యవసర సమయాలు, యాక్సిడెంట్స్ జరిగిన సమయాల్లో సమయం వృథా కాకుండా, విలువైన సమాచారాన్ని అందించి రోగుల ప్రాణాలను కాపాడ్డంలో ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఇక జిల్లాల వారీగా, స్పెషాలిటీస్ వారీగా హాస్పిటల్స్ సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.ఈ యాప్ ద్వారా ట్రీట్‌మెంట్ స్టేటస్ ని కూడా రోగి, సంబంధిత అటెండెంట్స్ తెలుసుకోవచ్చు. డబ్బుల వసూలు, వైద్య సేవల్లో లోపాలు, వైద్యం నిరాకరణ వంటి ఫిర్యాదులు ఈ యాప్ ద్వారా ట్రస్ట్‌కి నేరుగా పంపించొచ్చు. రోగి ఫీడ్ బ్యాక్ అంటే హాస్పటిల్ సేవలు, ఆరోగ్య పరిస్థితిని, ఆరోగ్య మిత్ర సేవలు ట్రస్ట్‌కి పంపించవచ్చు. హాస్పిటల్ వైద్య సేవల మీద రోగులు నేరుగా రేటింగ్ కూడా ఇవ్వవచ్చు.